దేశీయ అంకురాలు ఆర్థికాభివృద్ధికి ఎంతో కీలకంగా మారాయి. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించిన భారత్‌లో యూనికార్న్‌ల (100 కోట్ల డాలర్ల సంస్థ) సంఖ్య నామమాత్రమే. 2020లో 11 సంస్థలే ఈ స్థాయికి చేరాయి. అమెరికా, చైనాల్లో వీటి సంఖ్య ఎంతో అధికంగా ఉంటోంది. స్టార్టప్‌లు మరింత అభివృద్ధి చెందాలంటే.. బడ్జెట్‌లో సులభంగా రుణాలు అందించే ఏర్పాటుతో పాటు, పన్నులకు సంబంధించిన మినహాయింపులనూ అందించాలని కోరుతున్నాయి.
ప్రభుత్వమే వీసీగా మారాలి
తొలి దశలో ఉన్న అంకురాలకు పెట్టుబడులు రావడం కష్టమే. ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా అంకురాలకు సీడ్ ఫండింగ్ అందించే ఏర్పాట్లు చేశాయి. తెలంగాణలో టి-హబ్ అంకురాలకు పెట్టుబడులు సమకూర్చేందుకు పలు కార్యక్రమాలు చేపడుతోంది. అయినా పెద్ద మొత్తంలో పెట్టుబడులు కావాల్సినప్పుడు కష్టంగానే ఉంటోంది. అందుకే, కేంద్ర ప్రభుత్వ స్థాయిలో అంకురాలకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని ఒక అంకుర సంస్థ ప్రతినిధి అభిప్రాయపడ్డారు. ఒకరకంగా ప్రభుత్వం వెంచర్ క్యాపిటలిస్ట్ (వీసీ)గా మారాలి. స్టార్టప్ ఇండియాలో భాగంగా కొన్ని కంపెనీలకు నిధులు అందుతున్నాయి. దీన్ని విస్తృతం చేయాలి.
రుణ లభ్యత పెరగాలి
అంకురాలకు హామీ లేని రుణాలు రావడం కష్టంగా మారింది. రూ.2 కోట్ల టర్నోవర్ ఉన్న సంస్థలకూ రూ.20లక్షల బ్యాంకు రుణానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. స్టార్టప్‌లు, ఎంఎస్‌ఎంఈల కోసం ప్రత్యేక రుణాలు అందిస్తామని ప్రతి బ్యాంకు ప్రకటిస్తున్నా వాస్తవం వేరుగా ఉంటోంది. ‘ప్రతి బ్యాంకు ప్రతి మూడు నెలలకోసారి స్టార్టప్‌లకు ఎంత రుణం ఇచ్చిందో’ ఆర్‌బీఐకి నివేదించేలా బడ్జెట్‌లో ప్రతిపాదించాల్సిన అవసరం ఉంది. ఫిన్‌టెక్ అంకురాలు ఇటీవల గణనీయంగా పెరిగాయి. కరోనా తర్వాత వీటికి నిధుల కొరత తీవ్రమైంది. బ్యాంకుల నుంచి రుణాలు అందడం లేదు. ఎన్‌బీఎఫ్‌సీలకే నగదు కొరత ఉండటంతో అవీ వీటిని ప్రోత్సహించడం లేదు. దేశీయ ఫిన్‌టెక్ సంస్థలు రుణ వితరణలో వెనకబడి పోవడంతోనే, చైనా యాప్‌లు ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా అప్పులిస్తున్నాయని హైదరాబాద్‌కు చెందిన ఒక ఫిన్‌టెక్ సంస్థ వ్యవస్థాపకుడు పేర్కొన్నారు.
ఆన్‌లైన్ బోధనా రుసుములకూ ఊరట
లాక్‌డౌన్ నేపథ్యంలో విద్యాలయాల్లో నేరుగా బోధన ఆగడం వల్ల, ఎడ్యుటెక్ అంకురాలు దాదాపు 300శాతానికి పైగా వృద్ధి నమోదు చేశాయి. పిల్లల చదువు కోసం చెల్లించే ట్యూషన్ ఫీజును సెక్షన్ 80సీ కింద చూపించుకునే వీలుంది. అలాగే ఆన్‌లైన్ కోర్సులు, పాఠాలు బోధించే సంస్థలకు చెల్లించే ఫీజులకూ మినహాయింపు కల్పించాలి. ‘స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌ల కోసం తల్లిదండ్రులు ఎంతో ఖర్చు చేశారు. వీరికీ కొంత ఉపశమనం కలిగించే చర్యలు ఉండాలి. ఆన్‌లైన్ కోర్సులకు జీఎస్‌టీ మినహాయింపు ప్రకటిస్తే.. వారికి భారం తగ్గుతుందని ఎంపవర్‌ఓ ఎడ్యుకేషన్ సొల్యూషన్స్ సీఈఓ జెరోల్డ్ పెరీరియా అభిప్రాయపడ్డారు. ఈ సంస్థల్లో పెట్టుబడులను కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగం చేస్తే, పిల్లలకు రాయితీలపై డిజిటల్ ఉపకరణాలను అందించే వీలూ ఉంటుంది. ఇ-కామర్స్ వ్యాపారంలో ఉన్న అంకురాలకు విదేశీ పెట్టుబడులు వచ్చేలా వీలు కల్పించాలి. వెంచర్ క్యాపిటలిస్టులకు పన్ను నిబంధనలను సులభతరం చేయాలి.
సులభంగా అనుమతులు ఇవ్వాలి
ఒక అంకురాన్ని ప్రారంభించాలంటే.. ఇప్పుడు ఎన్నో నిబంధనలు పాటించాల్సి వస్తోంది. ఔత్సాహికులకు ఇబ్బంది లేకుండా ‘సింగిల్ విండో’లో ఆన్‌లైన్‌లోనే నమోదు చేస్తే మేలు. అంకుర సంస్థలకు సులభంగా అనుమతులు అందేలా చూడాలి. కరోనాతో ఆదాయాలు తగ్గిపోయినందున జీఎస్‌టీతో పాటు, కొన్నాళ్లపాటు ఆదాయపు పన్నులోనూ ప్రత్యేక మినహాయింపు కల్పిస్తే బాగుటుందని అంకురాల మాట.