రష్యాకు చెందిన సింగిల్ డోసు కొవిడ్ టీకా స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కోసం డా. రెడ్డీస్ ల్యాబ్ చేసిన దరఖాస్తును భారత ఔషధ నియంత్రణ మండలి తిరస్కరించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ (ఎస్‌ఈసీ) బుధవారం డా.రెడ్డీస్ అభ్యర్థనను పరిశీలించి, చేసిన సలహా మేరకు డీసీజీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
'స్పుత్నిక్ లైట్' అందుబాటులోకి వస్తే దేశంలో టీకా పంపిణీ కార్యక్రమం వేగవంతం అవుతుందని డా.రెడ్డీస్ అంతకుముందు ఓ ప్రకటనలో పేర్కొంది.
ఏంటీ స్పుత్నిక్ లైట్?
రెండు డోసుల 'స్పుత్నిక్ వి' టీకాను అభివృద్ధి చేసిన రష్యా సంస్థ ఆర్‌డీఐఎఫ్(రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్).. ఒకే డోసు 'స్పుత్నిక్ లైట్' టీకాను రూపొందించింది. దీనికి రష్యాలో అత్యవసర అనుమతి లభించింది. కొవిడ్-19ను అదుపు చేయడంలో ఒకే డోసు టీకా 79.4% ప్రభావశీలత కనబరచినట్లు ఆర్‌డీఐఎఫ్ పేర్కొంది.
ఈ టీకా తీసుకున్న వారిలో 28 రోజుల నాటికి వైరస్‌ను ఎదిరించే యాంటీ-బాడీలు తయారవుతున్నట్లు గుర్తించారు. ఇది కరోనా వైరస్ నూతన వేరియెంట్ల పైనా పనిచేస్తోందని సంస్థ ఇటీవల స్పష్టం చేసింది. వివిధ దేశాల్లో కొవిడ్-19 తీవ్రత దృష్ట్యా ప్రజలకు తక్కువ సమయంలో ఎక్కువ మందికి టీకా ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తోందని, దీనికి ఒకే డోసు టీకా మంచి పరిష్కారమని ఆర్‌డీఐఎఫ్ హెడ్ కిరిల్ డిమిట్రివ్ చెప్పారు. అదే సమయంలో రెండు డోసుల 'స్పుత్నిక్ వి' టీకాను కొనసాగిస్తామని తెలిపారు.