బంగారం డిపాజిట్ పథకం(జీడీఎస్)లో భారీ మార్పులను ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ) ప్రతిపాదించింది. ఇంట్లో వినియోగించే ఆభరణాలు కాకుండా.. అదనంగా మరికొంత బంగారం తక్కువగా ఉండేవారూ ఈ పథకంలో భాగస్వాములయ్యేందుకు వీలుగా నిబంధనలు మార్చాలని పేర్కొంది. ఇప్పటివరకు పసిడి డిపాజిట్ పథకం కింద కనీసం 30 గ్రాముల బంగారం డిపాజిట్ చేయాల్సి ఉంది. ఇకపై 10 గ్రాముల బంగారాన్నీ డిపాజిట్ చేసే వీలు కల్పించనుంది. ఇంట్లో వృథా ఉండే బంగారాన్ని ఇలా డిపాజిట్ చేసి వడ్డీ పొందే సౌలభ్యం ఉంటుంది. ఇదే కాకుండా పునరుద్ధరించిన పసిడి డిపాజిట్ పథకం(ఆర్-జీడీఎస్) కింద పసిడి డిపాజిట్ చేశాక.. బ్యాంక్ అందించే పత్రాన్ని (సర్టిఫికేట్) వేరే వ్యక్తికి బదిలీ చేసుకునే లేదా విక్రయించుకునే వీలూ కల్పించనుంది. పసిడి కడ్డీలు, నాణేలు, ఆభరణాల రూపంలో డిపాజిట్‌లను బ్యాంకులు స్వీకరిస్తాయి. వీటిపై బ్యాంక్ నిర్ణయించిన వడ్డీని డిపాజిట్‌దార్లకు చెల్లిస్తారు. మధ్య నుంచి దీర్ఘకాల డిపాజిట్‌లపై ఇచ్చే సర్టిఫికేట్‌లపై బ్యాంకుల నుంచి రుణం కూడా పొందవచ్చు.
బ్యాంకు ఏజెంట్లుగా విక్రేతలు
తాజా ప్రతిపాదనల ప్రకారం.. బ్యాంకు ఏజెంట్లుగా ఆభరణాల విక్రేతలు వ్యవహరిస్తారు. పసిడి నాణ్యతను పరీక్షించడంలో వీరిదే బాధ్యత. బ్యాంక్‌లో పసిడి డిపాజిట్ చేయడం కంటే ముందు, స్వచ్ఛత విషయంలో వర్తకుల నుంచి ధ్రువీకరణ పత్రం (సర్టిఫికేట్) తీసుకోవాల్సి ఉంటుంది. పసిడి సేకరణ కేంద్రాలుగా దుకాణాలు సేవలందిస్తాయి. ఇందుకు ప్రతిగా బ్యాంకులు వారికి ఫీజు లేదా కమీషన్ చెల్లిస్తాయి. ఇందుకు సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను భారత బ్యాంకుల సంఘం (ఐబీఏ) త్వరలో విడుదల చేయనుంది. ప్రతి నగరంలో మూడింట ఒకవంతు ప్రభుత్వ రంగ బ్యాంకులు జీడీఎస్ శాఖలుగా పనిచేయాల్సి ఉంటుంది. దీని కోసం ప్రభుత్వ రంగ బ్యాంకు శాఖలోని ఇద్దరు ఉద్యోగులకు శిక్షణ ఇస్తారు.
ఇదీ చదవండి: 100 అంకురాలు- విలువ రూ.18 లక్షల కోట్లు
త్వరలో పోర్టల్, యాప్
పసిడి డిపాజిట్ పథకం కోసం ప్రత్యేక పోర్టల్, మొబైల్ యాప్‌ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) సిద్ధం చేసే పనిలో ఉంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేయడానికి అవసరమైన నిధులను ఆర్థిక శాఖ సమకూరుస్తుంది. ఈ ప్లాట్‌ఫామ్ నిర్వహణ, ఇతర బాధ్యతలను ఎస్‌బీఐ చూసుకోనుంది.
ఆదరణ పెంచడమే లక్ష్యం
రత్నాలు, ఆభరణాల ఎగుమతుల సమాఖ్యతో చర్చలు జరిపిన అనంతరం కేంద్ర ఆర్థిక శాఖ ఆర్-జీడీఎస్‌ను తీసుకొచ్చింది. పసిడి బాండ్ల పథకం మాదిరిగానే జీడీఎస్‌కు ఆదరణ పెంచడమే లక్ష్యంగా తెలుస్తోంది. గత కొన్నేళ్లలో జీడీఎస్ పథకం కింద 20 టన్నుల పసిడి మాత్రమే బ్యాంకుల్లో డిపాజిట్ అయింది. దేశంలో వివిధ సంస్థలు, గృహాలు, బ్యాంకు లాకర్లలో దాదాపు 24,000 టన్నుల పసిడి నిరుపయోగంగా ఉందని అంచనా.
ఇదీ చదవండి: ఈటీఎఫ్, ఎస్‌జీబీల పెట్టుబడులతో లాభాలేమిటి?