సులువుగా వ్యాపారాన్ని నిర్వహించుకోవడానికి అనువైన దేశాల జాబితాలో భారత్ మరింత మెరుగైన స్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రపంచ బ్యాంకు తాజాగా విడుదల చేసిన ఈ సులభతర వాణిజ్య ర్యాంకుల్లో ఏకంగా 14 స్థానాలు మెరుగుపరుచుకుని 63వ స్థానం సొంతం చేసుకుంది. ప్రభుత్వం చేపట్టిన 'మేక్ ఇన్ ఇండియా'తో పాటు ఇతర సంస్కరణలతో విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తున్న నేపథ్యంలో.. భారత్ మెరుగైన ర్యాంకును సాధించినట్లు ప్రపంచ బ్యాంకు అభిప్రాయపడింది.
వరుసగా మూడో ఏడాది సులభతర వాణిజ్యంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన తొలి పది దేశాల సరసన నిలిచి రికార్డు సృష్టించింది భారత్.
భారతీయ రిజర్వ్ బ్యాంకు, ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థలు భారత ఆర్థిక వృద్ధి రేటును తగ్గించిన నేపథ్యంలో సులభతర వాణిజ్యంలో మంచి ర్యాంకు సాధించటం భారత్కు అనుకూల అంశం.
5 ఏళ్లలో.. 79 స్థానాలు..
2014లో నరేంద్ర మోదీ తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో 190 దేశాలకు ఇచ్చిన ర్యాంకుల్లో భారత్ 142వ స్థానంలో నిలిచింది. ఐదేళ్లలో ప్రభుత్వం చేపట్టిన పలు సంస్కరణల కారణంగా 2017లో 100వ స్థానంలో నిలిచిన భారత్.. 2018లో 23 స్థానాలు ఎగబాకి 77వ స్థానానికి చేరింది. తాజాగా 2019లో 63వ ర్యాంకును సాధించింది.
" అత్యుత్తమ పనితీరు కనబరిచిన తొలి పది దేశాల జాబితాలో వరుసగా మూడో ఏడాది భారత్ నిలిచింది. 20 ఏళ్లలో కొన్ని దేశాలు మాత్రమే ఈ విజయాన్ని సాధించాయి. ఈ ఏడాది ఏకంగా 14 స్థానాలు ఎగబాకింది. సులభతర వాణిజ్యంలో.. రానున్న రెండేళ్లలోపు టాప్ 50 లోకి వెళ్లనుంది. ఇందుకు భారత్ మరిన్ని సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది."
- సిమియన్ జంకోచ్, ప్రపంచ బ్యాంకు ఆర్థిక శాస్త్ర అభివృద్ధి డైరెక్టర్.
అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన దేశాలు..
సౌదీ అరేబియా (62), జోర్డన్ (75), టోగో (97), బహ్రెయిన్ (43), తజకిస్థాన్ (106), పాకిస్థాన్ (108), కువైట్ (83), చైనా (31), నైజీరియా (131).
తొలి స్థానంలో న్యూజిలాండ్..
190 దేశాలున్న ఈ జాబితాలో న్యూజిలాండ్ తిరిగి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. సింగపూర్, హాంకాంగ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ఇదీ చూడండి: గూగుల్ సూపర్ డూపర్ క్వాంటమ్ చిప్