'ఆత్మ నిర్భర్ భారత్'లో భాగంగా ఎలక్ట్రానిక్, మొబైల్ ఫోన్ల తయారీలో స్వావలంబన సాధించాలని ప్రభుత్వం పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో ఎలక్ట్రానిక్ ఉపకరణాల విడిభాగాలు, మొబైల్ ఫోన్ల విడిభాగాల దిగుమతులపై.. ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ రాజ్య సభకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో కీలక విషయాలు వెల్లడయ్యాయి.
దిగుమతులు ఇలా..
గత ఆర్థిక సంవత్సరం (2019-20)లో మొత్తం రూ.56,039 కోట్లు విలువైన స్మార్ట్‌ఫోన్ విడిభాగాలను భారత్ దిగుమతి చేసుకున్నట్లు ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో చైనా వాటా రూ.25,441 కోట్లుగా ఉన్నట్లు పేర్కొంది. మొత్తం దిగుమతుల్లో ఇవి దాదాపు 45 శాతానికి సమానం కావడం గమనార్హం.
మొత్తం ఎలక్ట్రానిక్స్ విడిభాగాల దిగుమతుల విలువ 2019-20లో రూ.1,15,558 కోట్లుగా ఉన్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో రూ.42,983 కోట్ల (37 శాతం) విలువైన దిగుమతులు చైనాను నుంచే చేసుకున్నట్లు వివరించింది.
ఇదీ చూడండి:ఏటీఎం కార్డ్ లేకుండా వాచ్‌తో చెల్లింపులు