విశ్వవ్యాపార వేదికలపై సత్తా చాటగల శక్తి అంకురాల సొంతం. ఒక మంచి ఆలోచన ఉన్నట్లయితే ఆ అంకుర వ్యాపారం బాగా సాగుతుంది. ఒక సంస్థకు రకరకాల కార్యకలాపాలు ఉంటాయి. వీటన్నింటి గురించి అంకుర ప్రతినిధులకు పూర్తి అవగాహన ఉండదు. ఈ విషయంలో సహాయ పడేవి, అంకురాలకు సంబంధించిన వ్యవస్థలో కీలక పాత్ర పోషించేవి ఇంక్యుబేటర్లు, యాక్సిలరేటర్లు.
కరోనా వల్ల అంకురాల వ్యాపార సరళి పూర్తిగా మారిపోయింది. వ్యాపారం నడిచే పరిస్థితి లేక కొన్ని సంస్థల కార్యకలాపాలు నిలిచిపోయాయి. ప్రారంభ దశలోనే కొన్ని అంకురాలు, వాటి ప్రణాళికను వాయిదా వేసుకున్నాయి.
సాధారణంగా తమ వద్ద ఉన్న అంకురాల నుంచి ఇంక్యుబేటర్లు, యాక్సిలరేటర్లు కొంత మొత్తాన్ని తీసుకుంటాయి. ఖర్చు తగ్గించుకునే క్రమంలో చాలా అంకురాలు ఇంక్యుబేటర్లను వదిలి వెళ్లే పరిస్థితి తలెత్తింది. అయితే ఇలా జరగకుండా వాటిని అట్టిపెట్టుకునేందుకు ఇంక్యుబేటర్లు, యాక్సిలరేటర్లు ప్రయత్నిస్తున్నాయి.
ఆన్‌లైన్‌కు మారిన కార్యకలాపాలు..
కరోనా వల్ల ఇంక్యుబేటర్ల కార్యకలాపాలు పూర్తిగా మారిపోయాయి. వర్చువల్, ఈ-ప్లాట్‌ఫామ్స్ అనేవి సాధారణం అయిపోయాయి. సమావేశం నుంచి మొదలుకొని పెట్టుబడిదారులను అనుసంధానించే వరకు అన్ని కార్యకలాపాలు ఆన్‌లైన్ ద్వారా జరుగుతున్నాయి. ప్రొడక్ట్ ఆధారిత అంకురాలకు స్థలం కావాల్సి ఉంటుంది. కార్యకలాపాలు నిలిచిపోవటంతో మొదటి లాక్డౌన్ నుంచి మూడో లాక్డౌన్ వరకు ఈ తరహా అంకురాలపై ప్రతికూల ప్రభావం పడింది.
కొవిడ్ వల్ల తలెత్తిన పరిస్థితుల్లో… మహమ్మారిపై పోరాటం చేసేందుకు నూతన ఆవిష్కరణల అవసరం ఉంది. దీన్ని అవకాశంగా మలచుకోవాలని ఇంక్యుబేటర్లు అంకురాలకు సూచిస్తున్నాయి. దీనిలో అవి విజయం సాధించాలని అనుకుంటున్నాయి.
ప్రభుత్వ నిర్దేశం..
చాలా వరకు ఇంక్యుబేటర్లకు ప్రభుత్వాలు నిధులు సమకూరుస్తాయి. ఇంక్యుబేటర్ల నుంచి ప్రభుత్వాలు ఆశించే వాటిలో, నిర్దేశించిన లక్ష్యాల్లో గమనించదగిన తేడా కనిపిస్తోందని వాటి ప్రతినిధులు చెబుతున్నారు. ప్రభుత్వం కొత్తగా ఇచ్చిన మార్గదర్శకాలను అవకాశంగా మలచుకొని, ప్రభుత్వం ఉపయోగించే విధంగా ఉండే ప్రొడక్ట్‌ను తీసుకురావాలని కోరుతున్నాయి.
ఇంకా చేయాలి..
ఇంక్యుబేటర్లు, యాక్సిలరేటర్లకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు, నిధుల ప్రక్రియను ఇంకా సులభతరం చేయాలని వాటి ప్రతినిధులు కోరుతున్నారు. వీటికి గుర్తింపు, బెంచ్‌మార్కింగ్ లాంటి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం, కార్పొరేట్ సంస్థలు.. అంకురాల ఉత్పత్తులకు అవకాశం ఇవ్వాలంటున్నారు.