భారీగా పెరుగుతున్న పప్పుల ధరలు నియంత్రించి, దేశీయంగా సరఫరాను పెంచే ఉద్దేశంతో ఎర్ర కంది పప్పుపై దిగుమతి సుంకాన్ని మాఫీ చేసింది కేంద్రం. దీనితోపాటు.. పప్పు ధాన్యాలపై వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సుంకం(ఏఐడీసీ)ను 20 శాతం నుంచి 10 శాతానికి తగ్గించింది.
వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించేందుకుగాను.. ప్రస్తుత అర్థిక సంవత్సరం నుంచి పెట్రోల్, డీజిల్, బంగారం, కొన్ని రకాల దిగుమతి ఉత్పత్తులపై విధిస్తున్న పన్నే ఈ ఏఐడీసీ.
పప్పు ధాన్యాలపై సుంకాల తగ్గింపునకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభ ముందు ఉంచారు.
సుంకాల తగ్గింపు పూర్తి వివరాలు..
అమెరికా మినహా.. ఇతర దేశాల నుంచి భారత్‌కు ఎగుమతవుతున్న ఎర్ర కంది పప్పుపై ప్రస్తుతం 10 శాతంగా ఉన్న కస్టమ్స్ డ్యూటీని ఎత్తివేస్తున్నట్లు సీతారామన్ వెల్లడించారు. అదే విధంగా అమెరికా నుంచి దిగుమతవుతున్న పప్పుపై కస్టమ్స్ సుంకాన్ని 30 శాతం నుంచి 20 శాతానికి తగ్గిస్తున్నట్లు పేర్కొన్నారు.
ధరల్లో వృద్ధి ఇలా..
వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. దేశంలో కిలో ఎర్ర కంది పప్పు ధర ఏప్రిల్‌తో పోలిస్తే 30 శాతం పెరిగి.. ప్రస్తుతం రూ.100 వద్ద ఉంది. ఏప్రిల్‌లో ఇది రూ.70గా ఉండటం గమనార్హం. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో ఈ ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయి.