సామాన్యులు కూడా దేశ, విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు సహాయపడుతున్నాయి విద్యారుణాలు. ఇతర రంగాలతో పోలిస్తే విద్యా రంగంలో ద్రవ్యోల్బణం రేటు ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా భారతదేశంలో ఈ రేటు 11 నుంచి 12 శాతం ఉంది. దీని కారణంగా రుణం లేకుండా ఉన్నత విద్య సాధ్యం కావడం లేదు. దీనికి తోడు కొవిడ్-19 పరిస్థితులు జాబ్ మార్కెట్‌ను తీవ్రంగా ప్రభావితం చేశాయి. ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో చదువు పూర్తయినా ఉద్యోగం సంపాదించడం అంత సులభం కాదు. మరి అన్ని పరిస్థితులను అధిగమించి విద్యారుణాన్ని సులభంగా తీర్చాలంటే నిబద్ధత అవసరం. కొన్ని మార్గాలను అనుసరిస్తే.. ఇది సాధ్యం అవుతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
విద్యారుణం సులభంగా చెల్లించేందుకు అనుసరించాల్సిన మార్గాలు..
1. ఎక్కువ కాలపరిమితి: సెక్యూర్డ్ ఎడ్యుకేషన్ లోన్‌ను ఎంచుకుంటే, తిరిగి చెల్లించేందుకు 10 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాల వ్యవధిని పొందొచ్చు. కాలపరిమతి ఎక్కువగా ఉంటే నెలావారీ ఈఎంఐ తగ్గుతుంది. సౌకర్యవంతమైన చెల్లింపులకు వీలుంటుంది.
2. వడ్డీ ముందే చెల్లించగలిగితే: రుణగ్రహీత కోర్సు పూర్తిచేసుకుని, సంపాదించడం ప్రారంభించిన తర్వాత రుణ చెల్లింపులు ప్రారంభించవచ్చు. చదువు కొనసాగిస్తున్నన్ని రోజులూ చెల్లింపులు చేయనవసరం లేదు. దీన్ని మారటోరియం పిరియడ్ అంటారు. కానీ వడ్డీని ముందుగా చెల్లించగలిగితే.. ప్రత్యేకించి మారటోరియం కాలంలో ఉద్యోగంలో చేరిన తర్వాత చెల్లించే ఈఎంఐలు చాలా వరకు తగ్గే అవకాశం ఉంది.
3. పార్ట్-టైమ్ వర్క్: రుణం త్వరగా చెల్లిస్తే మీపై ఉన్న భారం తగ్గుతుంది. పెట్టుబడులు త్వరగా ప్రారంభించేందుకు ఆస్కారం ఉంటుంది. ఉద్యోగంలో చేరి సంపాదించడం ప్రారంభించిన తర్వాత రుణం చెల్లింపులు మొదలుపెడితే.. చదువుకునే కాలంలో తోడైన వడ్డీతో పాటు మొత్తం రుణం చెల్లించేందుకు చాలా సమయం పడుతుంది. అందుకే చదువుకునే రోజుల్లోనే కొంత మొత్తం చెల్లించగలిగతే.. రుణ భారం తగ్గుతుంది. ఇందుకు పార్ట్ టైమ్ జాబ్ చేయొచ్చు. ప్రస్తుతం విద్యార్థులు చదువు కొనసాగిస్తూనే చేయగల పార్ట్ టైం జాబ్స్ ఎన్నో అందుబాటులో ఉన్నాయి. కింది తరగుతుల వారికి ట్యూషన్ చెప్పడం, మీ ఆర్ట్‌ని ఆన్‌లైన్‌లో అమ్మడం, గ్రాఫిక్ డిజైన్ సేవలు అందించడం ఇలా.. ఒక వైపు చదువు కొనసాగిస్తూనే మరోవైపు మీకు ఇష్టమైన పనిని.. తీరిక వేళల్లో చేయడం ద్వారా ఆదాయం పొందొచ్చు. ఈ మొత్తాన్ని మీ అవసరాల కోసం, అలాగే రుణ చెల్లింపులకు ఉపయోగించుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మీరు చేసే పనిలో నైపుణ్యం కూడా పెరుగుతుంది.
4. పొదుపు చేయడం నేర్చుకోండి: ఆదాయం పొందడం, పెంచుకోవడం ఒక ఎత్తైతే.. దాన్ని సరైన రీతిలో వినియోగించుకోగలగడం మరో ఎత్తు. ఆదాయంతో సమానంగా జీవినశైలి ఖర్చులు పెరిగితే మీ ప్రయత్నం వ్యర్థం అవుతుంది. కనీసం మీ రుణాన్ని క్లియర్ చేసే వరకు అయినా ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి. ప్రాథమిక అవసరాలతో పొదుపుగా జీవించడం నేర్చుకోవాలి. చదువు కోసం షెడ్యూల్ ఎలా అయితే రూపొందించుకుంటారో.. అలాగే ఆర్థిక విషయాల్లోనూ ప్రణాళిక ఉండాలి. బడ్జెట్ రూపొందించుకోవాలి. ఆహారం, అద్దె, దుస్తులు ఇలా అవసరమైన ఖర్చులను సమీక్షించండి. అవసరం లేని వాటిని ప్రణాళిక నుంచి తొలగించండి. కోరికలకి, అవసరానికి మధ్య ఉన్న వ్యత్యాసం గుర్తించండి. ఉదాహరణకు.. మీ చదువు, కెరియర్ కోసం మీకు ఒక కొత్త ల్యాప్‌టాప్ కావాలి అనుకోండి.. ఇది అవసరం. రోజూ బయటి ఆహారం తినడం అనేది కోరిక. అలాంటి వాటికి దూరంగా ఉండాలి.
5. భవిష్యత్తు ఆదాయం: కొన్ని కోర్సులు ఎంచుకుంటే ఉద్యోగం త్వరగా వస్తుంది. మరికొన్ని కోర్సుల్లో శాలరీ ప్యాకేజీ బాగుంటుంది. ఇలాంటి వాటికి తొందరగా రుణాలు మంజూరు అవుతాయి. అలా అని చెప్పి ఏదో ఒక కోర్సులో జాయిన్ అవ్వడం మంచిది కాదు. మీకు ఎక్కడ ఆసక్తి ఉంటుందో అలాంటి కోర్సును ఎంచుకోవాలి. ఎందుకంటే ఆసక్తి ఉన్న రంగంలోనే త్వరగా రాణించగలుగుతారు. దీంతో పాటు మీరు ఎంచుకున్న కోర్సుకు భవిష్యత్‌లో డిమాండ్ ఉంటుందా? లేదా? నిర్ధారించుకోవాలి. దేశ, విదేశాల్లో పని చేసేందుకు ఉన్న అవకాశాలు.. విదేశాలకు వెళ్లాలనుకుంటే అక్కడ నివసించేందుకు ఉన్న నిబంధనలు, వీసా ప్రాసెస్, ఇమ్మిగ్రేషన్ నిబంధనలు వంటి వాటి గురించి పూర్తి వివరాలు సేకరించాలి. అవసరమైన అన్ని విషయాల గురించి పరిశోధన చేసి ముందడుగు వేయాలి.
చివరగా..: మీ ఆసక్తిని బట్టి, భవిష్యత్ డిమాండ్‌ను ఉద్యోగ అవకాశాలను విశ్లేషించి కోర్సును ఎంచుకుని.. పైన వివరించిన విధంగా ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళితే తీసుకున్న అప్పు సులభంగా తిరిగి చెల్లించొచ్చు. తల్లిదండ్రులపై ఆధారపడకుండా స్వయంగా రుణం తీర్చగలిగితే జీవితం ప్రయాణంలో అనుకున్నది సాధించగలమన్న నమ్మకం పెరుగుతుంది.
ఇదీ చూడండి: 18 నెలల్లోనే రూ.36 పెరిగిన పెట్రోల్ ధర