కరోనా వైరస్ సంక్షోభంలో ఆర్థిక పరమైన సమస్యను నివారించేందుకు ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) నుంచి నగదు ఉపసంహరించుకోవడానికి కేంద్రం అనుమతిచ్చింది. సడలించిన పీఎఫ్ నిబంధనల ప్రకారం.. ఉద్యోగి, మూడు నెలల జీతం (ప్రాథమిక వేతనం, డీఏ) లేదా పీఎఫ్ ఖాతా నుంచి 75 శాతం బ్యాలెన్స్ రెండింటిలో ఏది తక్కువ ఉంటే దానిని ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేకుండా ఉపసంహరించుకోవచ్చు.
పీఎఫ్ ఉపసంహరణ దరఖాస్తు మార్గాలు..
పీఎఫ్ కార్యాలయానికి వెళ్లకుండా.. ఇంటి నుంచే పీఎఫ్ ఉపసంహరణకు దరఖాస్తు చేసుకునే వీలుంది. ఈపీఎఫ్‌ఓ యూనిఫైడ్ పోర్టల్‌కు లాగిన్ అయ్యి, యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్), పాస్‌వర్డ్‌ను ఉపయోగించి పీఎఫ్ అడ్వాన్స్ కోసం అభ్యర్థన చేసుకోవడం అందులో ఒకటి. దీనికి ప్రత్యామ్నాయంగా, సులభంగా ఉమంగ్ యాప్‌ని ఉపయోగించి కూడా పీఎఫ్ అడ్వాన్స్ ఉపసంహరణ అభ్యర్థనను చేయవచ్చు.
ఉమంగ్ యాప్ ద్వారా పీఎఫ్ ఉపసంహరణకు అభ్యర్థన ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉమంగ్ యాప్‌లో ప్రక్రియ ఇలా..
- ఉమంగ్ యాప్‌ని ఓపెన్ చేసి ఈపీఎఫ్ఓని ఎంపిక చేయండి.
- 'రిక్వెస్ట్ ఫర్ అడ్వాన్స్ (కొవిడ్-19)' ఎంచుకోండి.
- మీ యూఏఎన్(యూనివర్సల్ అకౌంట్ నంబర్) వివరాలను నమోదు చేసి, వన్-టైమ్ పాస్‌వర్డ్ పొందడానికి 'Get OTP' పై క్లిక్ చేయండి. మీ ఖాతాలో లాగిన్ అవ్వడానికి ఈ ఓటీపీని ఉపయోగించండి.
- ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్‌పై క్లిక్ చేయండి. మీరు లాగిన్ అయిన తర్వాత మీ బ్యాంకు ఖాతా చివరి నాలుగు అంకెలను నమోదు చేసి, డ్రాప్-డౌన్ మెను నుంచి మెంబర్ ఐడీని ఎంచుకోవాలి. ఆ తర్వాత 'ప్రొసీడ్ ఫర్ క్లెయిమ్' పై క్లిక్ చేయండి
- మీ చిరునామాను నమోదు చేసి, 'నెక్ట్స్' పై క్లిక్ చేయండి.
- మీ ఖాతా నంబర్, పేరు ముద్రించిన చెక్కు ఇమేజ్‌ను అప్‌లోడ్ చేయండి. అన్ని వివరాలు నమోదు చేసిన తర్వాత, మీ క్లెయిమ్ విజయవంతంగా దాఖలు అవుతుంది.
ఒకవేళ మీకు రెండు యూఏఎన్ల కంటే ఎక్కువ ఉన్నట్లయితే, మునుపటి అన్ని పీఎఫ్ నంబర్లను, ప్రస్తుత యూఏఎన్‌కి లింక్ చేసిన పీఎఫ్ ఖాతాకు బదిలీ చేయడం మంచిది. దాని కోసం, మీరు మొదట బదిలీ క్లెయిమ్ దాఖలు చేసి, ఆపై పీఎఫ్ అడ్వాన్స్ పొందాలి. అధిక మొత్తంలో పీఎఫ్ అడ్వాన్స్ పొందటానికి ఇది మీకు సహాయం చేస్తుంది.
వివరాలు సరిపోలకుంటే?
ఒకవేళ వివరాలు సరిపోలక పోవడం వలన మీరు క్లెయిమ్‌ను ఫైల్ చేయలేకపోతే, మీరు మెంబర్ యూనిఫైడ్ పోర్టల్‌కు లాగిన్ అయ్యి, క్లెయిమ్‌ను దాఖలు చేయడానికి ముందు వాటిని సరిచేయాలి. ప్రస్తుత కొవిడ్-19 సంక్షోభంలో ఎవరైనా ఉద్యోగం కోల్పోయినప్పటికీ, పీఎఫ్ అడ్వాన్స్‌ను పొందవచ్చు.
గరిష్ట ఉపసంహరణ పరిమితి :
మీ పీఎఫ్ బ్యాలెన్స్ ఎంత ఉన్నప్పటికీ, ఈపీఎఫ్ అడ్వాన్స్ కోసం గరిష్ట పరిమితి వర్తిస్తుంది. ఉదాహరణకు, ఏ అనే వ్యక్తికి నెలవారీ వేతనం రూ.20,000 ఉన్నట్లయితే, అర్హత ఉన్న అడ్వాన్స్ మొత్తం రూ. 60,000. ఒకవేళ ఏ అనే వ్యక్తికి నెలవారీ వేతనం రూ.30,000 ఉన్నట్లయితే, అడ్వాన్స్ మొత్తం రూ. 75,000లకు పరిమితం అవుతుంది.
క్లెయిమ్ స్టేటస్ తనిఖీ :
క్లెయిమ్‌ను దాఖలు చేసిన తరువాత, మీరు ఈపీఎఫ్ఓలోకి లాగిన్ అయ్యి ఆన్‌లైన్ సేవలను యాక్సెస్ చేయడం ద్వారా క్లెయిమ్ స్టేటస్ తనిఖీ చేయవచ్చు. ఈపీఎఫ్ఓ ప్రకారం, కొవిడ్-19 సంక్షోభం నేపథ్యంలో క్లెయిమ్‌లను మూడు పని దినాల్లోనే పరిష్కరిస్తోంది ఈపీఎఫ్ఓ. క్లెయిమ్‌లను ప్రాసెస్ చేసిన తరువాత, ఈపీఎఫ్ఓ ఈ మొత్తాన్ని హక్కుదారుడి బ్యాంకు ఖాతాకు బదిలీ చేస్తుంది.
ఉమంగ్ యాప్ వివరాలు..
ఉమాంగ్ (యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ-ఏజ్ గవర్నెన్స్) యాప్ అనేది ప్రాథమికంగా భారతీయ పౌరులందరికీ కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి స్థానిక ప్రభుత్వ సంస్థల వరకు ఈ-గోవ్ సేవలను, ప్రావిడెంట్ ఫండ్ సేవలతో సహా ఇతర పౌరుల కేంద్రీకృత సేవలను పొందటానికి ఒక వేదిక. 9718397183 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడం లేదా ఉమంగ్ వెబ్‌సైట్, ప్లే స్టోర్, యాప్ స్టోర్ల నుంచి ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఇదీ చూడండి:'కరోనా వ్యాక్సిన్‌కు నాలుగేళ్ల సమయం'