ఇటీవల కాలంలో క్రెడిట్ కార్డులు ఉపయోగించే వారి సంఖ్య చాలా పెరిగింది. క్రెడిట్ కార్డు మార్కెట్ కూడా విస్తరించింది. ఒకటి కంటే ఎక్కువ ఉపయోగించే వారు కూడా చాలా ఎక్కువగానే ఉన్నారు. ఇలా ఎన్ని కార్డులు వాడటం మంచిది? ఎన్ని కార్డులు ఉండటం వల్ల ఆర్థికంగా మేలు జరుగుతుంది? ఒకే ఒక కార్డు వాడటం ఉత్తమమేనా? అనే అంశాలను ఒకసారి పరిశీలిద్దాం.
ఒక వ్యక్తి ఎన్ని కార్డులు తీసుకోవాలి?
ఈ ప్రశ్నకు సమాధానం అందరికీ ఒకేలా ఉండదు. అవసరాలు, ఇతర ఆర్థిక అంశాల ఆధారంగా నిర్ణయించుకోవాలి. ఒకటి కంటే ఎక్కువ కార్డులు ఉండటం వల్ల ప్రయోజనాలతో పాటు ప్రతికూలతలు కూడా ఉన్నాయి. అన్నింటిని ఆలోచించి ఏది మంచి చేస్తుందో అన్న నిర్ణయం తీసుకోవాలి.
ప్రయోజనాలు..
ఎక్కువ ఖర్చు చేసుకోవచ్చు- ఎక్కువ కార్డులు ఉండటం వల్ల ఖర్చు పెట్టుకోవటానికి ఎక్కువ మొత్తం అందుబాటులో ఉంటుంది. అంటే మొత్తంగా ఎక్కువ క్రెడిట్ లిమిట్ ఉంటుంది. ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వచ్చినప్పుడు ఇది ఉపయోగపడుతుంది. తక్కువ క్రెడిట్ లిమిట్ తో కార్డులున్నట్లయితే.. ఒకటి కంటే ఎక్కువ కార్డులు తీసుకోవచ్చు. ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు కూడా ఒకటి కంటే ఎక్కువ కార్డులు ఉపయోగపడతాయి.
క్రెడిట్ స్కోరు పెంచుకోవచ్చు- ఎక్కువ క్రెడిట్ కార్డులుంటే క్రెడిట్ స్కోరుపై ప్రభావం ఉంటుందని అనుకోవటం చాలా తప్పు. వాస్తవానికి దీని ద్వారా క్రెడిట్ స్కోరు పెంచుకోవచ్చు. క్రెడిట్ లో లిమిట్ లో మనం ఉపయోగించిన మొత్తాన్ని గణిస్తే వచ్చేదే క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో. ఈ రేషియా తక్కువ ఉండటం వల్ల క్రెడిట్ స్కోరు మెరుగ్గా ఉంటుంది.
ఎక్కువ ఉన్నట్లయితే క్రెడిట్ ఎక్కువ అవసరం ఉన్నట్లు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు భావిస్తాయి. ఒక్క కార్డు మాత్రమే ఉండి, తక్కువ లిమిట్ ఉన్నట్లయితే క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సందర్భంలో ఒకటి కంటే ఎక్కువ కార్డులు వాడుకోవటం ఉత్తమం. లేదంటే ఉన్న కార్డులోనే క్రెడిట్ లిమిట్ పెంచుకోవటానికి కూడా ప్రయత్నించవచ్చు.
ఇదీ చదవండి: కరోనా కాలంలో క్రెడిట్ కార్డు వాడాలా వద్దా?
ఇదీ చదవండి: క్రెడిట్ కార్డు రద్దు చేసుకోవాలనుకుంటున్నారా?
ప్రతికూలతలు
రుణ ఊబి- ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉన్నందు వల్ల ఎక్కువ క్రెడిట్ సదుపాయం ఉంటుంది. తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఖర్చులు చేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల రుణ ఊబిలో చిక్కుకునే ప్రమాదం ఉంటుంది.
క్రెడిట్ స్కోరు దెబ్బతినే ప్రమాదం- ఎక్కువ క్రెడిట్ కార్డులుండటం వల్ల వాటిని నిర్వహించుకోవటం ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది. బిల్లు చెల్లించటం మరిచిపోయినట్లయితే క్రెడిట్ స్కోరు దెబ్బతింటుంది.
ఛార్జీలు- క్రెడిట్ స్కోరులకు వార్షిక రుసుం, ఆలస్య రుసుంలు ఉంటాయి. ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉండటం వల్ల ఎక్కువ వార్షిక రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఇతరత్ర ఖర్చుల భారం కూడా ఎక్కువగానే ఉంటుంది.
కార్డు తీసుకునే ముందు గుర్తుంచుకోవాల్సిన అంశాలు
* ఒక క్రెడిట్ కార్డు ఉన్నట్లయితే మరో క్రెడిట్ కార్డు అవసరమా? కాదా?అన్నది ఆలోచించుకోండి. ఒకవేళ తీసుకోవాలనుకుంటే మీ అవసరాలకు సరిపోయే కార్డును ఎంచుకోవాలి.
* క్రెడిట్ కార్డులు జాయినింగ్ బోనస్ రూపంలో ఇచ్చే రివార్డు పాయింట్లు, ఇతర ప్రయోజనాలకు మాత్రమే లొంగిపోకండి. ఈ ఒకసారి వచ్చే ఆఫర్లతో తాత్కాలిక ప్రయోజనమే కానీ, దీర్ఘకాలంలో కార్డు వల్ల భారం పెరగవచ్చు.
* క్రెడిట్ స్కోరు అప్పుడప్పుడు చూసుకోండి. క్రెడిట్ స్కోరుపై ప్రభావం పడుతుందని అనిపిస్తుంటే.. కార్డుల సంఖ్యపై ఆలోచించుకోండి.
* కార్డు తీసుకుంటున్నట్లయితే తిరిగి చెల్లించే సామర్థాన్ని మదింపు చేసుకోండి. సామర్థ్యాన్ని ఎక్కువ అంచనా వేసుకోకండి.
* ఎక్కువ కార్డులుంటే వాటి బిల్లులను సకాలంలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. దీనికోసం డ్యూ తేదీలను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలి.
ఇవీ చదవండి: కొత్తగా క్రెడిట్ కార్డు తీసుకున్నారా? ఇది మీ కోసమే