దాదాపు 13 ఏళ్ల క్రితం ఇద్దరు కుర్రాళ్లు దిల్లీ సరిహద్దుల్లోని గురుగ్రామ్‌లో ఉన్న యాంబియెన్స్ మాల్‌లోని ఓ కేఫ్‌కు లంచ్‌కి వెళ్లారు. అక్కడ అనేక మంది వివిధ రెస్టారెంట్ల ఫుడ్ మెనూలను చూస్తున్నారు. చాలా రద్దీగా ఉంది. ఏదో విధంగా భోజనం పూర్తి చేసుకొని ఆఫీసుకు తిరిగొచ్చారు. అక్కడ తమ సహచరులంతా ఫుడ్ మెనూ గురించి చర్చించుకుంటుండడం వీరిద్దరూ గమనించారు. అప్పుడు తట్టింది. ఫుడ్ మెనూలన్నింటినీ.. ఓ డిజిటల్ వేదికపైకి తీసుకొస్తే ఎలా ఉంటుంది అని. స్టాక్‌ఎక్స్ఛేంజీల్లో నమోదై చరిత్ర సృష్టించిన జొమాటో ప్రస్థానం 2008లో అలా ప్రారంభమైంది. ఆ ఇద్దరు కుర్రాళ్లే జొమాటో వ్యవస్థాపకులు దీపిందర్ గోయల్, పంకజ్ చద్దా.
తొలుత ఫుడీబే.కామ్
వెంటనే ఆ మెనూలన్నింటినీ స్కాన్ చేసి తమ కంపెనీ ఇంట్రానెట్‌లో రెస్టారెంట్ల డైరెక్టరీని రూపొందించారు. కొన్ని రోజుల్లోనే డైరెక్టరీకి ట్రాఫిక్ విపరీతంగా పెరగడం గమనించారు. దీన్ని ఫుడీబే.కామ్‌గా మార్చి ఓ వెబ్‌సైట్‌గా రూపొందించారు. సేవల్ని దిల్లీ వ్యాప్తంగా విస్తరించారు. కొద్ది నెలల్లోనే మంచి ఆదరణ లభించింది. ముంబయి, కోల్‌కతాకు కూడా సేవల్ని చేర్చారు. కాలేజీలో ఉన్నప్పుడే ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సేవలకు సంబంధించిన ఆలోచన వచ్చిందని గోయల్ ఓ సందర్భంలో గుర్తు చేసుకున్నారు. పిజ్జా కోసం లైన్లో నిలబడడం చిరాకుగా అనిపించి ఆ ఆలోచన తట్టినట్లు ఆయన చెప్పారు.
జొమాటోగా రూపాంతరం
ఫుడీబే.కామ్‌కు ఆదరణ పెరగడంతో దాన్ని దేశవ్యాప్తంగా విస్తరించాలని భావించారు. అయితే, అప్పటికే బాగా ప్రాచుర్యం పొందిన 'ఈబే' అనే ఇ-కామర్స్ సంస్థ పేరుతో పోలి ఉండడంతో పాటు ఫుడీబే అనే పదం కష్టమర్లను అంతగా ఆకట్టుకోకపోవచ్చునని ఆలోచించారు. అందరికీ సులభంగా గుర్తుండేలా 2010లో జొమాటోగా నామకరణం చేశారు. అయితే, జొమాటో అనే పేరు ఎంపిక వెనుక ఆసక్తికరమైన కథనం ఉంది. అప్పటికే రిజిస్టర్ అయి ఉన్న 'జొమాటో.కామ్' అనే యూఆర్‌ఎల్‌ను ఓ ప్రముఖ బ్రాండింగ్ సంస్థ నుంచి కొనుగోలు చేశారట. భారత్‌లో ప్రతి వంటింట్లో ఉంటే 'టొమాటో' అనే పదంతో జొమాటో సరిపోలి ఉండడంతో ఇది వారిని బాగా ఆకట్టుకుందట! వెంటనే సంస్థ పేరును సైతం జొమాటోగా మార్చారట!
పెట్టుబడుల వెల్లువ
జొమాటో వృద్ధిని పసిగట్టిన అనేక పెట్టుబడి సంస్థలు నిధులు సమకూర్చేందుకు ముందుకు వచ్చాయి. అలాగే మొట్టమొదటి సారి 'ఇన్ఫోఎడ్జ్' అనే ప్రముఖ సంస్థ రూ.60 లక్షల నిధులను అందజేసింది. అలా 2010-2013 మధ్య ఇన్ఫోఎడ్జ్ పలు దఫాల్లో 16.7 మిలియన్ డాలర్ల నిధుల్ని సమకూర్చి 57.9 శాతం వాటాల్ని సొంతం చేసుకుంది. అనంతరం 2013లో సెకోయా క్యాపిట్ నుంచి కూడా భారీగా నిధుల్ని రాబట్టింది. అలా సింగపూర్ ప్రభుత్వానికి చెందిన టెమాసెక్, వై క్యాపిటల్, అలీబాబాకు చెందిన యాంట్ ఫైనాన్షియల్, కోరా, టైగర్ గ్లోబల్ మేనేజ్‌మెంట్ కూడా జొమాటోకు నిధులు సమకూర్చాయి.
విదేశాల్లో జొమాటో రుచులు
2012లోనే జొమాటో తమ సేవల్ని విదేశాలకు విస్తరించింది. తొలుత యూఏఈలోకి ప్రవేశించింది. ప్రస్తుతం ఖతార్, దక్షిణాఫ్రికా, యూకే, ఫిలిప్పైన్స్, న్యూజిలాండ్, శ్రీలంక, టర్కీ, బ్రెజిల్‌లో సేవలు అందుతున్నాయి. ఈ సమయంలోనే ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్ యుగం ఊపందుకుంటుండడంతో మొబైల్ యాప్‌ను ప్రవేశపెట్టారు. ఆ తర్వాత సంస్థ రూపురేఖలే మారిపోయాయి.
కొనుగోళ్లే సగం బలం
ఈ ప్రయాణంలో ఇటు భారత్‌తో పాటు విదేశాల్లో అనేక కంపెనీలను జొమాటో కొనుగోలు చేసింది. దాదాపు 12 అంకుర సంస్థల్ని తనలో కలుపుకొంది. పోలండ్‌లోని రెస్టారెంట్ సెర్చ్ సర్వీస్ గ్యాస్ట్రోనౌసి, ఇటలీకి చెందిన సిబాండో, అమెరికాలోని అర్బన్‌స్పూన్, మ్యాపిల్ గ్రాఫ్, నెక్ట్స్ టేబుల్, టైనీబౌల్, ఉబర్‌ఈట్స్.. ఇలా అనేక సంస్థలు జొమాటోలో కలిసిపోయాయి.
తర్వాతి పయనం
పబ్లిక్ ఇష్యూలో హిట్ కొట్టిన జొమాటో భవిష్యత్తులో తమ సేవల్ని ఇతర రంగాలకు కూడా విస్తరించాలని యోచిస్తోంది. నిత్యావసర సరకుల డెలివరీని కూడా ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఇప్పటికే 'గ్రోఫర్స్' పేరిట యాప్‌ను కూడా రూపొందించింది. కరోనా మహమ్మారి సమయంలో కొన్ని నగరాల్లో ఈ సేవల్ని ప్రారంభించినప్పటికీ.. కొద్ది సమయంలోనే నిలిపివేసింది.
కుబేరుడిగా దీపిందర్
పబ్లిక్ ఇష్యూకు లభించిన భారీ ఆదరణతో వ్యవస్థాపకుడు సీఈఓ దీపిందర్ గోయల్ రాత్రికి రాత్రే భారత్‌లోని కుబేరుల జాబితాలో చేరారు. ఆయన వ్యక్తిగత సంపద 650 మిలియన్ డాలర్లకు చేరింది.
ఇవీ చదవండి: