కరోనా కారణంగా 2020లో గృహ విక్రయాలు భారీగా పడిపోయాయి. దిల్లీ-ఎన్సీఆర్లో వార్షిక ప్రాతిపదికన 50 శాతం క్షీణించి 21,234 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. 2019లో 42,828 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి.
దేశవ్యాప్తంగా 8 ప్రధాన నగరాల్లో ఇళ్ల డిమాండ్ 37 శాతం తగ్గి.. 1,54,534 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. 2019లో ఈ సంఖ్య 2,45,861గా ఉండటం గమనార్హం. ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ 'నైట్ ఫ్రాంక్ ఇండియా' విడుదల చేసిన తాజా నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
నివేదికలోని మరిన్ని విషయాలు..
- పుణెలో గత ఏడాది ఇళ్ల విక్రయాలు 18 శాతం తగ్గి.. 26,919 యూనిట్లుగా నమోదయ్యాయి. 2019లో ఇక్కడ 32,809 ఇళ్లు అమ్ముడవడం గమనార్హం. గత ఏడాది ఇళ్ల విక్రయాలు అత్యల్పంగా క్షీణించిన నగరం ఇదే.
- ముంబయిలోనూ ఇళ్ల విక్రయాలు 20 శాతం పడిపోయాయి. 2020లో 48,688 యూనిట్లు విక్రయమయ్యాయి. 2019లో ఈ సంఖ్య 60,943గా ఉంది.
- స్టాంప్ డ్యూటీలపై మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటు.. ముంబయి, పుణెలో గత ఏడాది చివరి నాలుగు నెలల్లో ఇళ్ల విక్రయాలు పెరిగేందుకు తోడ్పడింది.
- బెంగళూరులో గత ఏడాది ఇళ్ల డిమాండ్ 51 శాతం తగ్గి.. 23,579 యూనిట్లు విక్రయమయ్యాయి. 2019లో మొత్తం విక్రయాలు 48,076 యూనిట్లుగా ఉన్నాయి.
- చెన్నైలో ఇళ్ల విక్రయాలు 2019తో పోలిస్తే 2020లో 16,959 యూనిట్ల నుంచి 8,654 యూనిట్లకు (49 శాతం క్షీణత) పడిపోయాయి.
- హైదరాబాద్, కోల్కతాలో ఇళ్ల విక్రయాలు గత ఏడాది వరుసగా 38 శాతం, 21 శాతం చొప్పున క్షీణించాయి. హైదరాబాద్లో గత ఏడాది 10,042 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2019లో 16,267 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. కోల్కతాలో 2020లో 8,912 గృహాలు విక్రయమయ్యాయి. 2019లో ఇక్కడ 11,266 యూనిట్లు అమ్ముడుపోయాయి.
- అహ్మదాబాద్లో రికార్డ్ స్థాయిలో ఇళ్ల విక్రయాలు 61 శాతం పడిపోయాయి. 2020 మొత్తం మీద 6,506 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. 2019లో 16,713 ఇళ్లు విక్రయమవడం గమార్హం.
ఇదీ చూడండి:ప్రివ్యూ 2021: ఆశల పల్లకిలో స్థిరాస్తి రంగం