కరోనా వల్ల తీవ్రంగా దెబ్బ తిన్న స్థిరాస్తి రంగం ఇప్పుడిప్పుడే క్రమంగా కోలుకుంటోంది. ఈ ఏడాది మూడో త్రైమాసికం నుంచి స్థిరాస్తి రంగం గాడిలో పడినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
స్థిరాస్తి రంగ అధ్యయన సంస్థ అనరాక్ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశ వ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో.. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో గృహాల కొనుగోళ్లు (క్యూ2తో పోలిస్తే) 2.3 రెట్లు పెరిగాయని తేలింది.
ఇదే సమయానికి హైదరాబాద్‌లో ఏకంగా 152 శాతం గృహ కొనుగోళ్లు పెరిగాయని నివేదికలో వెల్లడైంది.
కొవిడ్‌తో కుదేలై.. నెమ్మదిగా కోలకుంటూ..
ఈ ఏడాది రెండో త్రైమాసికంలో కరోనా ప్రభావం ప్రారంభమైంది. అప్పటి వరకు స్థిరాస్తి రంగంలో గృహాల కొనుగోళ్లు మంచి స్థాయిలోనే ఉన్నాయి. ఒక్కసారిగా దేశంలో కరోనా కేసుల నమోదవటం వల్ల ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. దీనితో పాటు ఉద్యోగాలు, వేతనల్లో కోతలతో ప్రజలు స్థిరాస్తి కొనుగోళ్లకు మొగ్గు చూపలేదు. ఫలితంగా దేశ వ్యాప్తంగా రెండో త్రైమాసికంలో గృహాల కొనుగోళ్లు భారీగా పడిపోయాయి. లాక్డౌన్ తర్వాత క్రమంగా ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభమౌతుండటం వల్ల స్థిరాస్తి రంగం ఇప్పుడిప్పుడే గాడిన పడుతోంది.
"ఊహించిన విధంగానే రెండో త్రైమాసికంలో లాక్‌డౌన్‌తో పాటు ఆర్థికంగా పరిస్థితుల అనిశ్చితితో స్థిరాస్తి రంగం రాణించలేదు. మూడో త్రైమాసికంలో కొనుగోళ్లు విశేషంగా పెరిగాయి. కొనుగోలు సెంటిమెంట్ బాగున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అనిశ్చితి వల్ల కొనుగోలుదారులు కొంచెం వేచి చూసే ధోరణిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ గణాంకాలను చూస్తే.. పండుగ సీజన్‌తో కొనుగోలుదారుల సెంటిమెంట్ సాధారణ స్థితికి చేరుతుందనే అంచనాలు ఉన్నాయి. ప్రస్తుత ఈ సెంటిమెంటుతో పాటు పండుగ ఆఫర్లు, ఆకర్షణీయమైన రుణ సదుపాయాలు.. స్థిరాస్తి మార్కెట్‌ను గాడిలో పెడతాయని భావిస్తున్నాం."
- అనూజ్ పూరి, ఆనరాక్ ఛైర్మన్
43 శాతం క్షీణత..
దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య ఇళ్ల విక్రయాలు గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే 43 శాతం తగ్గి 87,460 యూనిట్లకు పడిపోయాయి. 2019 ఇదే సమయంలో 2.02 లక్షల ఇళ్లు విక్రయమయ్యాయి. అయితే.. క్యూ2తో పోలిస్తే మాత్రం జులై-సెప్టెంబర్ మధ్య ఇళ్ల విక్రయాలు 2.3 శాతం పెరిగినట్లు అనారాక్ అధ్యయనంలో తేలింది. మూడో త్రైమాసికంలో రూ.29,731 కోట్ల విలువైన విక్రయాలు జరిగాయి. రెండో త్రైమాసికంలో ఈ విలువ రూ.12,694 కోట్లుగా ఉంది. ఈ గణాంకాలు చూస్తే స్థిరాస్తి రంగంలో నెలకొన్న అనిశ్చితులు క్రమంగా తగ్గుతున్నట్లు స్పష్టమవుతోంది.
ఆర్బీఐ చర్యలు కారణమే..
దేశవ్యాప్తంగా కొనుగోళ్లు పెరిగేందుకు ఆర్బీఐ చర్యలు కూడా తోడ్పడినట్లు స్థిరాస్తి రంగంలోని నిపుణులు చెబుతున్నారు. ఆర్బీఐ చర్యలతో గృహ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గాయి. ప్రస్తుతం గృహ రుణాల వడ్డీ రేట్లు 7 శాతం వద్ద ఉన్నాయి. పండుగ సీజన్ నేపథ్యంలో స్థిరాస్తి రంగంలో.. ప్రాసెసింగ్ ఫీజు రద్దుతో, వడ్డీ రేట్లలో రాయితీ ఇస్తున్నాయి. దీనితో చాలా మంది సొంతిల్లు కొనుగోలుకు ఇదే మంచి సమయం అని భావిస్తున్నారు.
హైదరాబాద్‌తో పాటు అన్ని నగరాల్లో
కరోనా ప్రభావంతో దేశంలోని మిగతా నగరాల్లో ఇళ్ల ధరలు తగ్గాయి. మిగతా నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌పై కరోనా ప్రభావం తక్కువేనని రియల్టీ రంగ నిపుణులు చెబుతున్నారు. కరోనా కంటే ముందే హైదరాబాద్‌లో పూర్తయిన ఇళ్లు కొంచెం తక్కువగా ఉన్నాయని వారు అంటున్నారు. దీనితో హైదరాబాద్, దాని చుట్టు పక్కల అమ్మకాలు తగ్గాయే తప్ప, ధరలు పెద్దగా తగ్గలేదన్నది వారి మాట.
హైదరాబాద్ స్థిరాస్తి రంగానికి ఐటీ ఉద్యోగులే కీలకం. ఐటీ రంగంపై కరోనా భారీ ప్రభావం ఉంటుందని అనుకున్నప్పటికీ, నిజానికి జరిగింది వేరు. దీనితో వారు కొనుగోళ్లు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా గాడిలో పడితే అమ్మకాలు మళ్లీ సాధారణ స్థాయికి వస్తాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
నగరాల వారీగా విక్రయాల్లో పెరుగుదల ఇలా..
రెండో త్రైమాసికంతో పోలిస్తే.. మూడో త్రైమాసికంలో దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో విక్రయాలు భారీగా పెరిగాయి. చెన్నైలో దాదాపు 3.3 రెట్ల ఇళ్ల విక్రయాలు పెరిగాయి. దిల్లీలో 157 శాతం, హైదరాబాద్‌లో 152 శాతం, ముంబయిలో 154 శాతం, పుణెలో 125 శాతం, కోల్‌కతాలో 121 శాతం, బెంగళూరులో 81 శాతం ఇళ్ల విక్రయాలు పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
హైదరాబాద్‌లో రెండో త్రైమాసికంలో రూ.410 కోట్ల విలువైన ఇళ్ల విక్రయాలు జరగగా.. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ. 1,032 కోట్ల విలువైన విక్రయాలు జరగటం గమనార్హం.
ఇదీ చూడండి:ఉద్యోగులకు మారుతీ సుజుకీ పండుగ ఆఫర్!