వయోజనుల కోసం కొవావాక్స్ టీకాను ఈ ఏడాది అక్టోబర్‌లో విడుదల చేయాలనుకుంటున్నట్లు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా శుక్రవారం తెలిపారు. వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో పిల్లలకు వినియోగించేందుకు ఈ టీకాను అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. ఈ మేరకు హోం మంత్రి అమిత్ షాతో సమావేశం అనంతరం పూనావాలా మాట్లాడారు. దాదాపు 30 నిమిషాలపాటు వారిద్దరూ భేటీ అయ్యారు.
"టీకా ఉత్పత్తిలో మాకు ప్రభుత్వం ఎల్లప్పుడూ సహాకారం అందిస్తోంది. అందుకు కృతజ్ఞతలు. డిమాండ్‌కు తగ్గట్టుగా కొవిషీల్డ్ టీకా ఉత్పత్తిని విస్తరించేందుకు మా సంస్థ ప్రయత్నిస్తోంది. డీసీజీఐ అనుమతి పొందిన అనంతరం.. కొవావాక్స్ టీకాను పెద్దల కోసం అక్టోబర్‌లో విడుదల చేయాలని ఆశిస్తున్నాం. పిల్లల కోసం ఈ టీకాను వచ్చే ఏదాడి మొదటి త్రైమాసికంలో అందుబాటులోకి తెస్తాం."
-అదర్ పూనావాలా, సీరం సంస్థ సీఈఓ
అంతకుముందు.. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయాతోనూ అదర్ పూనావాలా భేటీ అయ్యారు. కొవిషీల్డ్ టీకా సరఫరాపై పూనావాలాతో ఫలప్రదమైన చర్చ జరిగిందని ట్విట్టర్ వేదికగా మాండవీయా తెలిపారు.
కొవావాక్స్ టీకా పిల్లల వినియోగానికి సంబంధించి రెండో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు భారత ఔషధ నియంత్రణ సంస్థకు చెందిన నిపుణుల కమిటీ గత నెలలో సీరం సంస్థకు షరతులతో కూడిన అనుమతులిచ్చింది. 2 నుంచి 17 ఏళ్ల వయుసు మధ్య 920 మంది పిల్లలపై ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. 12-17 ఏళ్ల వయసు పిల్లలు.. 460 మందిని ఒక గ్రూపుగా... 2 నుంచి 11 ఏళ్ల వయుసు మధ్య పిల్లలు 460 మందిని ఇంకో గ్రూపుగా విభజించి ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. అమెరికాకు చెందిన నొవావ్యాక్స్ సంస్థ ఈ కొవావ్యాక్స్ టీకాను అభివృద్ధి చేసింది.
ఇదీ చూడండి: పిల్లల కోసం సీరం కొత్త టీకా- ఉత్పత్తి షురూ