ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో దేశీయ ప్రైవేటు రంగ అతిపెద్ద బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ.. విశ్లేషకుల అంచనాలకు మించి రాణించింది. డిసెంబరు 31తో ముగిసిన త్రైమాసికంలో స్టాండ్‌ఎలోన్ ప్రాతిపదికన బ్యాంక్ నికరలాభం 18.09శాతం పెరిగి రూ. 8,758.29కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో హెచ్‌డీఎఫ్‌సీ నికరలాభం రూ. 7,416.68కోట్లుగా ఉంది.
ఏకీకృత నికరలాభం 8వేల కోట్లకుపైనే
మూడో త్రైమాసికంలో ఏకీకృత నికరలాభం 14.36శాతం పెరిగి రూ. 8,760కోట్లుగా ఉంది. నికర వడ్డీ ఆదాయం కూడా 15శాతం పెరిగి రూ. 16,317.6కోట్లకు చేరింది. అక్టోబరు- డిసెంబరు త్రైమాసికంలో బ్యాంక్ మొత్తం ఆదాయం రూ. 37,522 కోట్లకు చేరింది. ఇక స్థూల నిరర్ధక ఆస్తులు 1.08శాతం(సెప్టెంబరు త్రైమాసికంలో) నుంచి 0.81శాతానికి తగ్గాయి. నికర నిరర్ధక ఆస్తులు 0.17శాతం నుంచి 0.09శాతానికి పడిపోయాయి.
జనవరి 5న హెచ్‌డీఎఫ్‌సీ తమ రుణాలు, డిపాజిట్ల వివరాలను వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబరు చివరి నాటికి బ్యాంకులో రుణాలు 16శాతం పెరిగి రూ. 10.82లక్షల కోట్లుగా ఉండగా.. డిపాజిట్లు రూ. 12.71లక్షల కోట్లుగా ఉన్నట్లు తెలిపింది.
ఇదీ చూడండి: వాట్సాప్ అప్డేట్ కథేంటి..? ప్రత్యామ్నాయాలివే..