ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న పుణెలోని ఓ ప్లాంట్‌ను కొవాగ్జిన్ తయారీకి ఉపయోగించుకునేందుకు భారత్ బయోటెక్ సంస్థకు బాంబే హైకోర్టు అనుమతించింది. మహారాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉన్న ఈ తయారీ కేంద్రాన్ని భారత్ బయోటెక్‌కు చెందిన బయోవెట్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అప్పగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కర్ణాటక కేంద్రంగా పనిచేసే బయోవెట్ దాఖలు చేసిన పిటిషన్‌పై బాంబే హైకోర్టు డివిజన్ బెంచ్ మే 6న వాదనలు ఆలకించి.. ఈ మేరకు తీర్పు చెప్పింది.
కేసు నేపథ్యం
తయారీ కేంద్రం ఉన్న ప్రాంతాన్ని 1973లో మహారాష్ట్ర సర్కారు ఇంటర్వెట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు కేటాయించింది. ఇక్కడ ఎఫ్ఎండీ(ఫుట్ అండ్ మౌత్ డిసీజ్) టీకాలను తయారు చేస్తోంది ఈ సంస్థ. మెర్క్ అండ్ కో అనే అంతర్జాతీయ కంపెనీకి అనుబంధ సంస్థ అయిన ఇంటర్వెట్.. భారతీయ కార్యకలాపాల నుంచి విరమించుకోవాలని ఇటీవల నిర్ణయం తీసుకుంది.
అనంతరం ఆ భూమిని, తయారీ కేంద్రాన్ని బయోవెట్‌కు బదిలీ చేసేందుకు ఒప్పందం చేసుకుంది. దీనిపై ప్రభుత్వ అనుమతి కోరగా.. పుణె అటవీ విభాగం నిరాకరించింది. అది రిజర్వ్ ఫారెస్ట్ అని, 1973లో దాన్ని కేటాయించడమే పొరపాటు అని పేర్కొంది. అప్పటి నుంచి ఆ ప్లాంట్ ఖాళీగా ఉంది.
అనుకూలంగా తీర్పు
దీంతో బయోవెట్ సంస్థ బాంబే హైకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యాజ్యం దాఖలు చేసింది. కొవాగ్జిన్‌తో పాటు ఎఫ్ఎండీ టీకాను తయారు చేసేందుకు ఖాళీగా ఉన్న ఈ ప్లాంట్‌ను ఉపయోగించుకునే అనుమతులు ఇప్పించాలని కోరింది. తాజాగా దీనిపై బయోవెట్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది. 12 హెక్టార్లను స్థలాన్ని వినియోగించుకునేందుకు సైతం కోర్టు అనుమతులు ఇచ్చింది.
ఇదీ చదవండి: 'దురుద్దేశంతోనే సెంట్రల్ విస్టాపై పిటిషన్లు'