ప్రత్యక్ష పన్నుల చట్టాలను మరింత సరళీకృతం చేసేందుకే ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. సరళమైన పన్ను విధానాల కోసం ఇప్పటికే కీలక సంస్కరణలు చేసినట్లు చెప్పారు. కొత్త పన్ను విధానాన్ని ఎంపిక చేసుకునే సౌలభ్యాన్ని పన్ను చెల్లింపుదారులకే కల్పించినట్లు ఆమె చెప్పుకొచ్చారు. 160వ ఆదాయపు పన్ను దినోత్సవం సందర్భంగా ఈ మేరకు సందేశం అందించారు నిర్మలా.
ప్రస్తుత సంక్షోభ సమయంలో పన్ను చెల్లింపుదారులకు వివిధ సడలింపులు ఇచ్చామని.. నగదు సమస్యలను పరిష్కరించడానికి ఆదాయపన్ను శాఖ తీవ్రంగా కృషి చేస్తోందని పేర్కొన్నారు. పన్నుల విభాగం, చెల్లింపుదారుల మధ్య స్నేహపూర్వక వాతావరణానికి కారణమైన పారదర్శకత, సులభతర విధానాలను ఆమె అభినందించారు. ఆదాయ పన్ను చట్టాల్లో ఇటీవల కీలక మార్పులు చోటు చేసుకున్నాయన్నారు.
" ప్రత్యక్ష పన్ను చట్టాలను మరింత సరళీకృతం చేసేందుకే మా నిరంతర ప్రయత్నం. అందులో భాగంగా పన్ను చెల్లింపుదారుల కోసం కొత్త పన్ను విధానాలను తీసుకొచ్చాం. పాత విధానంలో ఉండాలనుకోవటం లేదంటే కొత్త దానికి మారటంపై వారికే అవకాశం కల్పించాం. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా పలు సడలింపులు ఇస్తూ కార్పొరేట్ పన్ను రేట్లను ప్రభుత్వం తగ్గించింది. నిజాయితీ గల పన్ను చెల్లింపుదారులకు సౌకర్యాలు కల్పించడానికి, ఆదాయ లీకేజీని అరికట్టడానికి సాంకేతికతను తీసుకువచ్చాం."
- నిర్మలాసీతారామన్, ఆర్థిక మంత్రి.
దేశ అభివృద్ధి, సంక్షేమంలో ఆదాయపన్ను శాఖ.. కీలకపాత్ర పోషించటమే కాదు, వృత్తి నైపుణ్యం, ప్రమాణాలను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తుందన్నారు నిర్మలా.
ఆదాయపన్ను దినోత్సవం సందర్భంగా ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ భూషన్ పాండే, సీబీడీటీ ఛైర్మన్ పీసీ మోదీలు తమ అనుభవాలను పంచుకున్నారు. ఆదాయపన్ను చట్టాల్లో తీసుకొచ్చిన మార్పులను గుర్తు చేసుకున్నారు.
ఇదీ చూడండి: ఇ- కామర్స్ సంస్థలకు కొత్త నిబంధనలు నోటిఫై