కేంద్ర ప్రభుత్వం త్వరలోనే నూతన విద్యా విధానాన్ని తీసుకొస్తుందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పార్లమెంట్లో 2020 పద్దును ప్రవేశపెట్టిన నిర్మలా... ఈ అంశంపై 2 లక్షలకుపైగా సలహాలు సేకరించినట్టు స్పష్టం చేశారు.
"2030లోగా ప్రపంచంలోనే అత్యధికంగా పనిచేయగలిగిన యువత భారత్‌లో ఉండనుంది. వారికి అక్షరాస్యతతో పాటు ఉద్యోగ నైపుణ్యాలు కూడా ఎంతో అవసరం. నూతన విద్యా విధానంపై రాష్ట్ర విద్యాశాఖలు, పార్లమెంట్ సభ్యులతో చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 2లక్షలకుపైగా సలహాలు అందాయి. త్వరలోనే నూతన విద్యా విధానాన్ని ప్రకటిస్తాం."
-- నిర్మలా సీతారామన్, ఆర్థికమంత్రి.
వచ్చే ఆర్థిక సంవత్సరంలో విద్యా రంగానికి రూ. 99,300 కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపారు నిర్మలా. నైపుణ్యాభివృద్ధి కోసం రూ. 3వేల కోట్లు మంజూరు చేయనున్నట్టు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా స్థానిక సంస్థల్లో ఇంజినీరింగ్ విద్యార్థులకు అప్రెంటీస్ విధానం ఉంటుందని తెలిపారు ఆర్థికమంత్రి.
వైద్యుల కొరత తీర్చేందుకు...
జాతీయ పోలీసు విశ్వవిద్యాలయం, జాతీయ ఫోరెన్సిక్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్న కేంద్ర ఆర్థిక మంత్రి... డిగ్రీ స్థాయిలో ఆన్‌లైన్ కోర్సులు ప్రవేశపెడతామని చెప్పారు. జాతీయ విద్యాసంస్థల జాబితాలోని టాప్ 100 కళాశాలల్లో ఈ కోర్సులు అందుబాటులో ఉంటాయన్నారు.
జిల్లా ఆస్పత్రుల్లో వైద్యుల కొరత తీర్చేందుకు.. ప్రభుత్వ, ప్రైవేటు, భాగస్వామ్యంలో మెడికల్ కళాశాలలను అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయులు, నర్స్‌లు, పారా మెడికల్ సిబ్బంది కోసం స్పెషల్ బ్రిడ్జ్ కోర్సు ప్రారంభించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు.
భారత్‌లో చదవాలనుకునే విదేశీ విద్యార్థులకు ‘ఇండ్‌శాట్’ పేరుతో స్టడీ ఇన్ ఇండియా ప్రోగ్రాం రూపొందించినట్లు తెలిపారు. విద్యారంగంలో విదేశీ పెట్టుబడులకు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.