పన్ను చెల్లింపు వ్యవస్థను సరళీకరించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అఖిల భారత వర్తక కూటమి సమావేశంలో పాల్గొన్న సీతారామన్... నిజాయతీగా పన్ను చెల్లించే వ్యక్తులకు ఎలాంటి వేధింపులు ఉండకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) మరింత సమర్థవంతంగా ఉండేలా ప్రజల నుంచి వచ్చే సూచనలను స్వీకరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. అన్ని వర్గాల నుంచి వచ్చిన సూచనల ఆధారంగా పన్ను వ్యవస్థను సరళీకరించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని స్పష్టం చేశారు.
పన్ను పరిపాలనా వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావడానికి ఆదాయపు పన్ను శాఖ ప్రత్యేక కంప్యూటర్ జనరేటెడ్ డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ నెంబర్(డీఐఎన్)ను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ డీఐఎన్ వ్యవస్థ 2019 అక్టోబర్ 1 నుంచి అమలులోకి వచ్చినట్లు వెల్లడించారు. దీని ద్వారా ఆదాయపు పన్ను శాఖ ద్వారా అందించే అన్ని సమాచారాలను చెల్లింపుదారులకు చేరవేయనున్నట్లు స్పష్టం చేశారు. ఫలితంగా ఏవైనా తప్పుడు నోటీసులు వచ్చినప్పుడు ఈ-ఫైలింగ్ పోర్టల్లో తనిఖీ చేసి చెల్లింపుదారులు త్వరగా పసిగట్టుకోవచ్చన్నారు.
షాపింగ్ ఫెస్టివల్స్
దుబాయి తరహాలో దేశవ్యాప్తంగా త్వరలో మెగా షాపింగ్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు సీతారామన్ వెల్లడించారు. వర్తకులు తమ ఉత్పత్తులను విక్రయించడానికి ఇదో వేదిక వంటిదన్నారు. దీని నిర్వహణ కోసం వాణిజ్య మంత్రిత్వ శాఖ కసరత్తులు చేస్తోందని తెలిపారు. వస్త్ర, తోలు పరిశ్రమ, యోగా టూరిజాన్ని అభివృద్ధి చేయడానికి దేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లో ఈ ఫెస్టివల్స్ నిర్వహించనున్నట్లు తెలిపారు.