పన్ను ఎగవేతదారులపై ప్రభుత్వం తీసుకున్న కఠిన చర్యల కారణంగా జీఎస్టీ ఆదాయం పెరిగిందని కేంద్ర ఆర్థిక కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే వెల్లడించారు. పన్ను ఎగవేతలకు పాల్పడిన సుమారు 187 మందిని అరెస్ట్ చేయడం, 7 వేల సంస్థలపై చర్యలు ప్రారంభించడం వల్ల జీఎస్టీ వసూలు పెరిగిందని ఆయన తెలిపారు. 2020 డిసెంబర్‌లో రికార్డు స్థాయిలో 1.15 లక్షల కోట్ల రూపాయల జీఎస్టీ వసూలు అయిందని పాండే వివరించారు. లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడం వల్ల జీఎస్టీ వసూళ్లు డిసెంబరులో ఆల్ టైం గరిష్ఠస్థాయికి చేరాయన్నారు.
నకిలీ బిల్లుల ద్వారా జీఎస్టీ , ఆదాయపు పన్ను కట్టని వారు... చర్యల నుంచి తప్పించుకోలేరని అజయ్ భూషణ్ పాండే హెచ్చరించారు. మరోవైపు....... గుట్కా, పాన్ మసాల, పొగాకు ఉత్పత్తుల తయారీ, రహస్య సరఫరా ద్వారా జీఎస్టీ ఎగవేస్తున్న రాకెట్‌ను దిల్లీలోని కేంద్ర జీఎస్టీ అధికారులు గుర్తించారు. సుమారు 832 కోట్ల రూపాయల జీఎస్టీ ఎగవేతకు పాల్పడినట్లు తెలుసుకుని ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. గుట్కా తయారీ కర్మాగారంలో 65 మంది కార్మికులు పనిచేస్తున్నారని, ఇతర రాష్ట్రాలకు ఇక్కడి నుంచి గుట్కా సరఫరా అవుతోందని తెలిపారు.
ఇదీ చూడండి: 'వర్క్ ఫ్రం హోం'కు ఇక చట్టపరమైన మద్దతు!