కరోనాతో బాధపడుతున్న రోగుల చికిత్స కోసం అందుబాటులో ఉన్న పడకలు, మెడికల్ ఆక్సిజన్ సమాచారాన్ని అందించేందుకు సరికొత్త ఫీచర్‌ను సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ పరీక్షిస్తోంది. దీని ప్రకారం ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఆసుపత్రుల్లోని పడకలు, మెడికల్ ఆక్సిజన్ లభ్యతపై సమాచారాన్ని స్థానికులు గూగుల్ మ్యాప్స్‌లో షేర్ చేయవచ్చని తెలిపింది. రెండోదశలో మహమ్మారి విరుచుకుపడుతున్న నేపథ్యంలో.. సహాయక చర్యలకు మద్దతునిచ్చేందుకు తాము చేసే ప్రయత్నాల్లో భాగంగా దీనిని చేపట్టినట్లు టెక్ దిగ్గజం ప్రకటించింది.
ధ్రువీకరణ తప్పనిసరి..
మ్యాప్స్‌లోని ప్రశ్నలు-సమాధానాలు టూల్‌తో.. ఎంపిక చేసిన ప్రాంతాల్లోని పడకలు, ఆక్సిజన్ లభ్యతను ప్రజలు అడిగేందుకు వీలుంటుంది. అంతేగాక సంబంధిత సమాచారాన్ని షేర్ చేసేందుకు ప్రజలకు అనుమతిస్తుంది కూడా. అయితే ఈ సమాచారాన్ని అందించే ముందు వినియోగదారులు దాని కచ్చితత్వాన్ని ధ్రువీకరించాల్సి ఉంటుందని గూగుల్ పేర్కొంది.
విరాళాల సేకరణలోనూ..
కొవిడ్‌పై పోరులో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో కలిసి పని చేస్తున్న గూగుల్.. ఇప్పటికే సెర్చ్ అండ్ మ్యాప్స్‌లో 2,500 పరీక్షా కేంద్రాల వివరాలతో పాటు.. 23,000 టీకాల కేంద్రాల సమాచారాన్ని అందుబాటులో ఉంచింది. వివిధ సహాయక చర్యలతో పాటు.. గివ్ఇండియా సహా.. వివిధ స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తూ విరాళాలు సేకరిస్తున్నట్లు తెలిపింది.
ఇవీ చదవండి: 'వ్యాక్సిన్ సాంగ్'తో గూగుల్ అవగాహన