ఏ కంపెనీ అయినా.. తమ ఉత్పత్తిని మార్కెట్లోకి తెచ్చే విషయంలో ప్రమోషన్లు చేయడం అత్యంత ప్రధాన అంశంగా భావిస్తాయి. అందుకోసం వివిధ రకాలుగా ప్రయత్నించి, ప్రజల దృష్టిని తమ వైపు మరల్చేలా చేస్తాయి. ఇదే తరహాలో గూగుల్ సంస్థ కూడా.. త్వరలో తీసుకురానున్న పిక్సెల్ 6 సిరీస్ ఫోన్‌తో(Google Pixel 6) పాటు దాని 'గూగుల్ టెన్సార్ చిప్' కోసం విభిన్నంగా ప్రయత్నించింది. అసలేం చేసిందంటే..?
పిక్సెల్ 6 సిరీస్ ఫోన్(Google Pixel 6) కోసం తీసుకువస్తున్న గూగుల్ టెన్సార్ చిప్సెట్ ప్రమోషన్ కోసం 'గూగుల్ ఒరిజినల్ చిప్స్' పేరుతో.. ఆలు చిప్స్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. అయితే.. ఈ చిప్స్ మన దగ్గర కాదండోయ్! జపాన్‌లో మాత్రమే. అంతేకాదు.. ఈ ఆలు చిప్స్ కోసం గూగుల్ ప్రత్యేక వెబ్‌సైట్‌ను కూడా తెరిచింది. అక్కడ వినియోగదారులు తమకు చిప్స్ కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు.
అయితే... ఈ ఆలు చిప్స్ ప్యాకేజీలు ఆర్డర్ చేసుకున్న వారందరికీ దొరకవు. ఆర్డర్ చేసుకున్న వారి నుంచి.. లాటరీలో ఎంపికైన 1,000 మందికి మాత్రమే అవి అందుతాయి. అయితే.. జపాన్‌లో ఈ చిప్స్ కోసం సెప్టెంబర్ 9 నుంచి సెప్టెంబర్ 17 మధ్య 10,000 మంది ఇప్పటికే ఆర్డర్ చేసుకున్నారు.
ఈ ఆలు చిప్స్ టేస్ట్ ఎలా ఉంటాయ్?
ఈ గూగుల్ చిప్స్ 'సాల్టీ ఫ్లేవర్'తో ఉంటాయని తెలుస్తోంది. పిక్సెల్ 6 ఫోన్లు ఉన్న రంగుల్లోనే ఈ చిప్స్ ప్యాకెట్లు కూడా ఉంటాయి. అంతేగాకుండా.. ఈ ఆలు చిప్స్ కోసం గూగుల్ యూట్యూబ్‌లో ఓ ప్రోమో వీడియో కూడా విడుదల చేసింది.
మరి గూగుల్ టెన్సార్ చిప్ సంగతేంటి?
ఈ గూగుల్ టెన్సార్ చిప్ ఆ సంస్థ నుంచి వస్తున్న మొదటి ఇన్-హౌస్ సిస్టమ్ ఆన్ చిప్(ఎస్ఓసీ). గూగుల్ దీని గురించి ఇంకా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. అయితే.. మరి మీరు కూడా ఈ గూగుల్ చిప్స్‌ను తినాలని ఆశపడుతున్నారా? కానీ, మీకు ఆ ఛాన్స్ లేదు. ఎందుకంటే.. గూగుల్ ప్రమోషనల్ క్యాంపెయిన్ సెప్టెంబర్ 17తోనే ముగిసింది.
ఇదీ చూడండి: గూగుల్‌కు రూ.1300 కోట్ల జరిమానా!