కరోనా మహమ్మారి దెబ్బతో అనేక రంగాలు కుదేలయ్యాయి. అనేక మంది ఉపాధి కోల్పోయారు. కంపెనీలు ఉద్యోగులను తొలగించాయి. అయితే, దాదాపు ఏడాదిన్నర గడిచిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి. ఇప్పటి వరకు అప్రమత్తంగా వ్యవహరించిన కంపెనీలు.. తాజాగా భారీ ఎత్తున నియామకాలు(It Sector Jobs) చేపడుతున్నాయి. ముఖ్యంగా ఐటీ కంపెనీలు ఉద్యోగులకు మంచి వేతనాలిచ్చి నియమించుకుంటున్నాయి(It Sector Jobs).
ఇటీవల విడుదలైన 'ఇండీప్ నివేదిక' ప్రకారం.. ఐటీ నిపుణులకు డిమాండ్ 400 శాతం పెరిగింది. ఐటీతో పాటు ఇతర నైపుణ్య ఆధారిత ఉద్యోగాలకు కూడా గిరాకీ పుంజుకుంటోంది. నియామకాలే కాకుండా గత ఏడాదితో పోలిస్తే జీతభత్యాలను సైతం భారీ ఎత్తున పెంచారు. ఫుల్-టైమ్ ఇంజినీర్ల వేతనాలు దాదాపు 70-120 శాతం పెరిగాయి. గతేడాది ఈ పెంపు 20-30 శాతంగా నమోదైంది.
భారీ ఎత్తున మహిళా ఉద్యోగులను నియమించుకోనున్నట్లు టెక్ దిగ్గజం టీసీఎస్ ఇటీవల ప్రకటించింది. ఇదే తరహాలో ఇన్ఫోసిస్, విప్రో సహా ఇతర ఐటీ కంపెనీలు రానున్న కొన్ని నెలల్లో భారీ ఎత్తున నియామకాలు చేపట్టనున్నట్లు ఇండీప్ నివేదిక పేర్కొంది. సరైన నైపుణ్యాలున్న ఉద్యోగులకు ఐటీ రంగంలో సువర్ణావకాశాలు ఉన్నాయని తెలిపింది.
ఇక ఐటీ కంపెనీలు కేంద్రీకృతమైన బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి నగరాల్లో స్థిరాస్తి వ్యాపారాలు కూడా పుంజుకునే అవకాశం ఉంది.
ఇదీ చూడండి: పెళ్లికి యువత 'నో'.. ఆ విషయానికి మాత్రం సై!
ఇదీ చూడండి: సామాన్యుడిపై మళ్లీ 'పెట్రో' భారం- పెరగనున్న ధరలు!