బంగారం ధరలు మరోసారి చుక్కలనంటాయి. గురువారం 10 గ్రాముల మేలిమి బంగారం రూ.550 పెరిగి దిల్లీలో రూ.38, 470లకు చేరుకుంది. పసిడి ఇలా రూ.38 వేలకుపైగా పెరగడం ఇదే మొదటిసారి. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం, దేశీయ ఆర్థిక సమస్యల నేపథ్యంలో పెట్టుబడిదారులు బంగారం కొనుగోలుకే మొగ్గుచూపారు.
వెండి ధర రూ.630 పెరిగి కిలో రూ.44,300లను తాకింది. వీక్లీ బేస్డ్ డెలివరీ కిలోకు రూ.745 పెరిగి రూ. 43,730కు చేరుకుంది.
తొలిసారిగా
అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతల మధ్య అంతర్జాతీయంగా బంగారం ధర 6 సంవత్సరాల్లో తొలిసారిగా ఔన్సుకు 1500 డాలర్లు పెరిగిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించడం, మధ్యప్రాచ్యంలో రాజకీయ ఉద్రిక్తతలకు తోడు దేశీయ ఆర్థిక మందగమనం కారణంగానూ బంగారం ధరలు ఆకాశాన్నంటాయి.
ఈ జూన్‌లో దేశ ఆర్థిక వృద్ధి రేటు 7 శాతంగా ఉంది. దేశంలో పెట్టుబడులు, డిమాండ్ మందగించిన నేపథ్యంలో... ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష అనంతరం 2019-20 సంవత్సరానికి గాను 6.9 శాతానికి దేశ ఆర్థిక వృద్ధిరేటును తగ్గించింది.
అంతర్జాతీయంగా
అంతర్జాతీయంగా చూసుకుంటే, ప్రస్తుతం న్యూయార్క్‌లో ఔన్స్ బంగారం 1,497.40 డాలర్లతో స్వల్ప నష్టాలతో ట్రేడవుతోంది. వెండి ఔన్స్‌కు 17.16 డాలర్లతో కొనసాగుతోంది.
ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, దిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం రూ.550 పెరిగి 10 గ్రాములు రూ.38,470కు చేరుకుంది. 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం కూడా రూ.550 పెరిగి 10 గ్రాములకు రూ.38,300లకు చేరుకుంది.
గురువారం సావరిన్ బంగారం కూడా 8 గ్రాములకు రూ.700లు పెరిగి రూ.28,500కు చేరుకుంది.
వెండి నాణేలకు మంచి డిమాండ్ ఉంది. 100 వెండి నాణేలు కొనుగోలు ధర రూ.87,000లుగా ఉంది. వీటి అమ్మకం విలువ రూ.1000లు పెరిగి రూ.88,000లకు అమ్ముడవుతున్నాయి.
ఇదీ చూడండి: ఎఫ్‌పీఐలకు సర్కారు భరోసా... భారీ లాభాల్లో సూచీలు