బంగారం ధర నూతన రికార్డులకు చేరుకుంది. సానూకూల అంతర్జాతీయ పరిణామాలతో 10 గ్రాముల పసిడి ధర 50 రూ. పెరిగి.. రూ. 38, 520 వద్ద విక్రయాలు జరుగుతున్నాయని అఖిల భారత సరాఫా అసోసియేషన్ వెల్లడించింది.
పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి తగ్గిన కొనుగోళ్లతో మార్కెట్ ముగింపుతో పోలిస్తే కిలో వెండి రూ. 1150 తగ్గి రూ. 43వేలకు చేరింది.
దేశ రాజధాని దిల్లీలో 99.9 శాతం స్వచ్ఛమైన పసిడి ధర 10 గ్రాములకు రూ. 38, 470 వద్ద ట్రేడవుతుండగా... 99.5 శాతం ఉన్న ప్రీమియం లోహం విలువ రూ. 38, 300గా ఉంది.
100 వెండి నాణేల కొనుగోలు ధర రూ.88వేలు పలుకుతుండగా... అమ్మకానికి రూ. 89 వేలుగా ఉంది.
ప్రపంచ మార్కెట్లలో పెరిగిన పసిడి ధర...
అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్సు బంగారం విలువ 1503.30 అమెరికా డాలర్లకు చేరింది. చైనాతో ఒప్పందానికి తాము సిద్ధంగా లేమని, సురక్షిత పెట్టుబడి అయిన బంగారం వైపు మళ్లాలన్న అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచనలతో బంగారం ధరలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి.