ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులతో పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు తీవ్ర రూపం దాల్చాయి. ఈ నేపథ్యంలో దేశీయ మార్కెట్లో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి బలహీనపడటమూ ధరల పెరుగుదలకు ఆజ్యం పోసింది.
దిల్లీలో నేడు 10 గ్రాముల పసిడి ధర రూ.485 పెరిగి రూ.42,810కి చేరింది. పుత్తడి దారిలోనే వెండి కూడా భారీగా పెరుగుదల నమోదు చేసింది. దిల్లీలో కిలో వెండి రూ.855 వృద్ధితో రూ.49,530కి చేరుకుంది.
అంతర్జాతీయంగా పసిడి ధరలు పెరగడం కూడా దేశీయంగా ప్రభావం చూపించినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,584 అమెరికన్ డాలర్లకు చేరగా ఔన్సు వెండి ధర 18.43 అమెరికన్ డాలర్లుగా ఉంది.