ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ రుణాలు రికార్డు స్థాయి వద్ద 100 శాతం దాటొచ్చని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) హెచ్చరించింది. 2020లో మొత్తం మీద సగటు ద్రవ్యలోటు కూడా జీడీపీలో 14 శాతానికి చేరొచ్చని అంచనా వేసింది. మునుపెన్నడూ చూడనంత వేగంగా ప్రభుత్వ రుణాలు జీవనకాల గరిష్ఠాలకు చేరొచ్చని తెలిపింది.
ద్రవ్యలోటు పెరిగేందుకు కారణాలు..
కరోనా కారణంగా ఉత్పత్తి తగ్గడానికి తోడు.. ప్రభుత్వ ఆదాయాలు కూడా క్షీణించడం వల్ల ప్రభుత్వ రుణాలు, ద్రవ్య లోటు పెరగవచ్చని ఐఎంఎఫ్ ద్రవ్య వ్యవహారాల విభాగ డైరెక్టర్ విటర్ గాస్పర్ తెలిపారు.
2020-21 ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ రుణాలు.. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 20 పర్సెంటీజే పాయింట్లు పెరిగినట్లవుతుందని అన్నారు.
ఈ దేశాల్లో మరీ అధికం..
అమెరికా, జపాన్, ఐరోపా దేశాల్లో ఈ రుణాలు మరింతగా పెరిగొచ్చని ఐఎంఎఫ్ లెక్కగట్టింది. ద్రవ్యలోటు అంతక్రితం ఏడాదితో పోలిస్తే 10 పర్సెంటేజీ పాయింట్లు ఎక్కువగా.. 14 శాతానికి పెరగవచ్చని తెలిపింది.
అంతర్జాతీయ రికార్డు స్థాయి ప్రభుత్వ అప్పులు అటు వర్థమాన దేశాలు.. ఇటు అభివృద్ధి చెందిన దేశాల్లోనూ కనిపించనున్నాయని వెల్లడించింది ఐఎంఎఫ్. అభివృద్ధి చెందిన దేశాల దీర్ఘకాల రుణ స్థిరత్వంపై ఇపుడు మరింత ఒత్తిడి కనిపించవచ్చని గాస్పర్ తెలిపారు. కొవిడ్ కంటే ముందు నుంచీ ప్రభుత్వ రుణాలు పెరుగుతూనే ఉన్నాయని.. ఈ సమయంలో రుణాల స్థిరీకరణకు ద్రవ్య సర్దుబాటు అవసరమని ఐఎంఎఫ్ అభిప్రాయపడ్డారు.