భారత బిలియనీర్ గౌతమ్ అదానీ సంపద ఈ వారంలో రికార్డు స్థాయిలో ఆవిరైంది. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ సూచీ ప్రకారం.. ప్రపంచంలో ఏ వ్యక్తి కోల్పోనంతగా 13.2 బిలియన్ డాలర్లు ఆయన నష్టపోయారు. ప్రస్తుతం ఆయన సంపద 63.5 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ నష్టంతో ఆసియాలో రెండో అత్యంత ధనవంతుడి ర్యాంక్‌ను కోల్పోయారు అదానీ.
కొన్ని రోజుల క్రితం వరకూ ఆసియాలోనే అత్యంత ధనవంతుడైన ముకేశ్ అంబానీతో గౌతమ్ అదానీ దాదాపు సమానంగా ఉండగా.. ఈ వారం లెక్కలు తారుమారయ్యాయి. అదానీ షేర్లు ఈ వారం మొత్తం రికార్డు పతనాన్ని చవి చూడటం ఇందుకు కారణం.
షేర్ల పతనానికి కారణాలు..
అదానీ గ్రూప్‌లో దాదాపు రూ.43,500 కోట్ల పెట్టుబడులు ఉన్న విదేశీ పెట్టుబడి సంస్థలైన.. అల్బులా ఇన్వెస్ట్మెంట్ ఫండ్, క్రెస్ట ఫండ్, ఏపీఎంఎస్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఖాతాలను ఎన్ఎస్డీఎల్ నిలిపివేసినట్లు సోమవారం వార్తలొచ్చాయి. ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) ప్రకారం అవసరమైన సమాచారం సమర్పించకపోవడమే ఆయా సంస్థల ఖాతాల నిలిపివేతకు కారణం అనేది ఆ వార్తల్లోని సారాంశం.
ఈ వార్తలతో సోమవారం రికార్డు స్థాయిలో పతనమైన అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు.. వారం మొత్తం నష్టపోతూనే వచ్చాయి. 5 సెషన్లలోనూ షేర్లు లోవర్ సర్క్యూట్‌ను తాకటం గమనార్హం.
ఖాతాల నిలిపివేతపై క్లారిటీ..
తమ సంస్థపై వచ్చిన వార్తలను.. నిర్లక్ష్య పూరితమైన తప్పిదంగా పేర్కొంటూ అదానీ సోమవారమే క్లారిటీ ఇచ్చింది. ఆ వార్తల్లో నిజం లేదని వెల్లడించింది. పెట్టుబడిదారులను ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించటానికే ఇది జరిగిందని.. ఇది మదుపరులకు ఆర్థికంగా తీరని నష్టాన్ని చేకూర్చుతుందని, సంస్థ ఖ్యాతిని దెబ్బతీస్తుందని లిఖిత పూర్వకంగా ప్రకటన చేసింది. ఈ ప్రకటన తర్వాత కూడా సంస్థ షేర్లు కుదేలవడం గమనార్హం.
ఇదీ చదవండి:Adani Group: ఆమె ట్వీట్ వల్లే ఇంత నష్టం?