ప్రపంచంలోనే అతిపెద్ద మూడో చమురు దిగుమతిదారు, వినియోగదారు భారతే. మన ముడి చమురు(Fuel Price Hike) అవసరాల్లో 85%; సహజ వాయువు అవసరాల్లో 50 శాతానికి పైగా మనం దిగుమతిపైనే ఆధారపడి ఉన్నాం. ముడి చమురును పెట్రోలు, డీజిల్‌గా; సహజ వాయువును ఆటోమొబైల్‌లో సీఎన్‌జీగా, ఫ్యాక్టరీల్లో ఇంధనంగా మనం ఉపయోగించుకుంటాం.
ఎందుకు పెంపు?
అంతర్జాతీయంగా ప్రామాణికంగా భావించే బ్రెంట్ చమురు ఫ్యూచర్ ధర ప్రస్తుతం ఒక్కో బారెల్‌కు 79 డాలర్లుగా పలుకుతోంది. ఇది మూడేళ్ల గరిష్ఠ స్థాయికి దగ్గరలో ఉంది. నెల కిందట ఇది 72 డాలర్ల కంటే తక్కువే. ఈ నేపథ్యంలో ముడి చమురు ధరలు పెరుగుతూనే ఉంటే భారత్(Fuel Price Hike In India) వంటి ప్రధాన దిగుమతిదార్ల వద్ద పెద్దగా అవకాశాలుండవని.. నిర్ణయాల విషయంలో పాలుపంచుకునే ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి అంటున్నారు. ఈ ధరల్లో పెరుగుదల కాస్తా మార్జిన్లపై ఒత్తిడి తీసుకురావడంతో పెట్రోలు, డీజిల్ ధరలను పెంచడం ద్వారా ఆ భారాన్ని వినియోగదార్లకు బదిలీ చేస్తున్నట్లు వివరించారు.
గత మూడు నెలల్లో...
జులై, ఆగస్టులో ముడి చమురు ధరలు పైకీ కిందకూ చలించాయి. అయితే జులై 18 నుంచి సెప్టెంబరు 23 వరకు చమురు మార్కెటింగ్ కంపెనీ(ఓఎమ్‌సీ)లు ధరల్లో ఎటువంటి పెంపూ చేయలేదు. అంతే కాదు మొత్తం మీద లీటరు పెట్రోలు రూ.0.65; డీజిల్ లీటరు రూ.1.25 చొప్పున తగ్గించారు. అయితే అంతర్జాతీయ చమురు ధరలు ఎంతకీ చల్లారకపోవడంతో ఓఎమ్‌సీలు తమ పెట్రోలు, డీజిల్ రిటైల్ ధరలను వరుసగా సెప్టెంబరు 28, సెప్టెంబరు 24 నుంచి అమల్లోకి వచ్చేలా పెంచడం మొదలు పెట్టాయని ఆ అధికారి వివరించారు. సోమవారం (అక్టోబరు 04) ఎటువంటి మార్పులు చేయనప్పటికీ.. సెప్టెంబరు 24 నుంచి డీజిల్ లీటరు ధర రూ.2.15 వరకు పెరగ్గా.. గత వారం రోజుల్లో పెట్రో లీటరు ధర రూ.1.25 వరకు ప్రియమయ్యాయి.
ప్రభుత్వం ఏం అంటోంది..
అంతర్జాతీయంగా ధరలు భారీగా పెరుగుతున్నా చమురు కంపెనీలు మాత్రం రిటైల్ ధరల నిర్ణయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయని పెట్రోలియం కార్యదర్శి తరుణ్ కపూర్ చెబుతున్నారు. అంతర్జాతీయంగా పెట్రోలు ధరలు బారెల్‌కు 85.10 డాలర్ల నుంచి 87.11 డాలర్లకు ఒక రోజులోనే పెరిగాయి. డీజిల్ ధరలూ బారెల్‌కు 85.95 డాలర్ల నుంచి 87.27 డాలర్లకు పెరిగింది. ఎల్‌పీజీ కూడా నెల రోజుల్లో టన్నుకు 665 డాలర్ల నుంచి 797 డాలర్లకు పెరిగింది. ఈ పెరుగుదలను(Fuel Price Increase) చమురు కంపెనీలు వినియోగదార్లకు బదిలీ చేయలేదని గుర్తు చేశారు. కేవలం 'కాస్తంత నుంచి మధ్యస్తం' వరకు మాత్రమే పెంపు చేసినట్లు తెలిపారు. సహజ వాయువు విషయంలో అయితే ఉత్పత్తి వ్యయం అయిన 3.5 డాలర్ల (ఒక్కో ఎమ్‌ఎమ్‌బీటీయూకు) కంటే తక్కువకే అంటే 2.9 డాలర్లకే ఇపుడు చేరింది. అంతక్రితం ఇది 1.79 డాలర్లుగానే ఉందన్నారు.
7 ఏళ్ల గరిష్ఠానికి బారెల్ ధర
సరఫరా వైపు చూస్తే ఒపెక్, ఒపెక్ అనుబంధ దేశాలు జులైలో ఉత్పత్తి కోతల నుంచి పెంపు దిశగా అడుగు వేశాయి. కనీసం ఏప్రిల్ 2022 వరకు రోజుకు 0.4 మిలియన్ బారెళ్ల మేర పెంచుతూ వెళ్లాలని నిర్ణయించుకున్నాయి. అయితే అంతకు మించి సరఫరాను పెంచితేనే సరఫరా వైపున్న ఆందోళనలు తగ్గుతాయి. అమెరికా, భారత్ వంటి పెద్ద వినియోగదార్ల నుంచి పెరుగుతున్న ఒత్తిడి కారణంగా త్వరలోనే సరఫరా పెరుగుతుందని ఒక అధికారి అంచనా వేశారు.
నవంబరులోనూ రోజుకు 0.4 మి.బారెళ్ల మేర ఉత్పత్తిని పెంచాలన్న అంతకు ముందు నిర్ణయానికే సోమవారం నాటి సమావేశంలో ఒపెక్, అనుబంధ దేశాలు కట్టుబడ్డాయి. దీంతో స్వల్పకాలంలో అంతర్జాతీయ ముడి చమురు ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒపెక్ తాజా నిర్ణయంతో న్యూయార్క్ స్టాక్ మర్చంటైల్ ఎక్స్ఛేంజీలో ముడి చమురు బారెల్ ధర 3% లేదా 2.32 డాలర్ల మేర పెరిగి ఏడేళ్ల గరిష్ఠ స్థాయి అయిన 78.17 డాలర్లకు చేరింది.
ఇదీ చదవండి: ఆగని పెట్రో మంట- నాలుగో రోజూ పెరిగిన ధరలు