ఉద్యోగుల భవిష్య నిధి ఖాతాల్లోని మొత్తాల ద్వారా సమకూరే వడ్డీపై పన్ను విధించే దిశగా కేంద్రం పీఎఫ్ నిబంధనల్లో(PF New Rules) కొన్ని మార్పులు చేసింది. బడ్జెట్‌లో పేర్కొన్నట్లుగా ఇకపై ఏడాదికి రూ.2.5 లక్షలకు మించి పీఎఫ్ ఖాతాల్లో(EPFO) జమ చేసే వారికి పన్ను విధించనుంది. అంటే ఏడాదికి రూ.2.5 లక్షల కంటే ఎక్కువ మొత్తాన్ని ఉద్యోగులు తమ వాటాగా పీఎఫ్ ఖాతాలో జమచేస్తే అదనంగా జమచేసే మొత్తాలపై వచ్చే వడ్డీ మీద ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం రెండు వేర్వేరు ఖాతాలను ఏర్పాటు చేయాల్సిందిగా పేర్కొంటూ నిబంధనలను నోటిఫై చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) మంగళవారం నిబంధనలను విడుదల చేసింది.
దీని ప్రకారం ప్రస్తుతం ఉన్న ఈపీఎఫ్ ఖాతాలను (EPFO) రెండుగా విభజిస్తారు. ఒకటి పన్ను వేయదగిన ఖాతా.. రెండోది పన్ను మినహాయింపు ఖాతాగా పేర్కొంటారు. 2021 మార్చి 31 నుంచి ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఏడాదికి రూ.2.5 లక్షలు కంటే ఎక్కువ మొత్తం పీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తూ పన్ను మినహాయింపు పొందుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ పేర్కొన్నారు. అందుకే ఆ విధంగా నిర్దేశించిన మొత్తం కంటే ఎక్కువ జమయ్యే మొత్తాలపై వచ్చే వడ్డీపై పన్ను విధిస్తామని(PF New Rules) తెలిపారు. అందుకు అనుగుణంగా తాజా నిబంధనలను నోటిఫై చేశారు. అయితే, రెండేసి ఖాతాల నిర్వహణ అనేది భారంతో కూడుకున్న వ్యవహారమని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చూడండి: అప్పడం రౌండ్గా లేకపోతే జీఎస్టీ కట్టాలా?