పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్న వేళ.. ఈ అంశంలో తమకు ఎలాంటి నియంత్రణ లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వార్షిక బడ్జెట్‌పై చెన్నై సిటిజన్ ఫోరం నిర్వహించిన సదస్సులో పాల్గొన్న ఆర్థిక మంత్రి పెట్రోలియం ఉత్పత్తుల ధరలు సాంకేతికంగా చమురు కంపెనీల నియంత్రణలోనే ఉంటాయని వివరణ ఇచ్చారు.
"పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెరుగుదల అంశం చాలా ఇబ్బందికరమైనది. ఇది చాలా భయంకరమైన ధర్మ సంకటం. ధరలు తగ్గించాలి అనే జవాబు తప్ప మరేది కూడా ఎవరినైనా ఒప్పించలేదు. ఈ అంశంలో ఏ మంత్రి కూడా ఎవరినీ ఒప్పించలేరు. చమురు ఉత్పత్తి, ఎగుమతి చేసే ఒపెక్ దేశాలు అంచనా వేసినట్లు కాకుండా ఉత్పత్తి తగ్గించనున్నాయి. ఇది పెట్రోలియం ఉత్పత్తుల ధరల విషయంలో భవిష్యత్తులో మరింత ఒత్తిడిని పెంచుతుంది. సాంకేతికతంగా పెట్రోలియం ఉత్పత్తుల ధరల నిర్ణయం ప్రభుత్వం నుంచి తప్పించారు. వాటిపై ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణ లేదు. చమురు మార్కెటింగ్ కంపెనీలు ముడి చమురును దిగుమతి చేసుకోవడం, శుద్ధి చేయడం, పంపిణీ చేయడం, రవాణా ఛార్జీలను నిర్ణయించడం వంటివి చేస్తాయి. కాని ధరల పెరుగుదల సమస్య నుంచి బయటపడేందుకు కేంద్ర, రాష్ట్రాలు కూర్చుని చర్చలు జరపాలి అన్నది నిజం."
-నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి
పెట్రోలియం ఉత్పత్తుల ధరలను తగ్గించే అంశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలు జరపాల్సిన అవసరం ఉందని ఆర్థిక మంత్రి అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి:బంగారంపై రుణమా?.. ఇవి గుర్తుంచుకోండి