ప్రైవేట్ ఎయిర్‌లైన్ స్పైస్‌జెట్ ప్రారంభించిన టికెట్ల డిస్కౌంట్ అమ్మకాలను నిలిపివేయాలని నియంత్రణ సంస్థ డీజీసీఏ ఆ సంస్థకు ఆదేశాలు జారీ చేసింది. మే 25న దేశీయ విమాన సర్వీసులు ప్రారంభమైన తర్వాత రుసుములపై పరిమితులు ఉన్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
మార్గదర్శకాల ప్రకారమే..
ఈ విషయంపై స్పందించిన స్పైస్‌జెట్.. డీజీసీఏ మార్గదర్శకాలకు అనుగుణంగానే నడుచుకున్నట్లు తెలిపింది.
ఐదు రోజుల వన్ ప్లస్ వన్ ఆఫర్ సేల్‌ను ప్రారంభిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది స్పైస్‌జెట్. ఇందులో భాగంగా వన్‌వే టికెట్ ధర అతి తక్కువగా... రూ. 899గా నిర్ణయించింది. డిస్కౌంట్ సమయంలో టికెట్లు బుకింగ్ చేసుకున్న వారికి కాంప్లిమెంటరీ వోచర్లు అందించనున్నట్లు వెల్లడించింది.
కొత్త ఛార్జీలు
ప్రయాణ సమయం ఆధారంగా విమాన ఛార్జీల వివరాలను మే21న పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఏడు విభాగాలు ఏర్పాటు చేసిన ఛార్జీలను నిర్ణయించింది. ఆగస్టు 24 వరకు ఇవే ఛార్జీలు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది. అనంతరం ఈ సమయాన్ని నవంబర్ 24 వరకు పొడగించింది.