కరోనా ధాటికి తీవ్రంగా నష్టపోతున్న వార్తా సంస్థలకు చేయూతగా నిలిచేందుకు 100 మిలియన్ డాలర్లను విరాళంగా ఇస్తున్నట్లు సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్బుక్ తెలిపింది. కరోనా సంక్షోభం గురించి నమ్మదగిన సమాచారం ఇచ్చే మీడియాను సంరక్షించుకోవడం అవసరమని ఫేస్బుక్ అభిప్రాయపడింది.
"కొవిడ్ 19 మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ప్రజలకు సరైన సమాచారం ఇవ్వడానికి వార్తా పరిశ్రమ అసాధారణ పరిస్థితుల్లో పనిచేస్తోంది."
- క్యాంప్‌బెల్ బ్రౌన్, ఫేస్‌బుక్స్ న్యూస్ పార్ట్నర్షిప్స్ డైరెక్టర్
'గతంలో కంటే ఇప్పుడు జర్నలిజం అత్యంత అవసరం. అయితే కరోనా ప్రభావంతో మీడియాకు వచ్చే ప్రకటనల ఆదాయం బాగా తగ్గిపోతోంది. ముఖ్యంగా స్థానిక జర్నలిస్టులు తీవ్రంగా నష్టపోతున్నారు' అని బ్రౌన్ అన్నారు.
నిధులు ఇలా...
ఫేస్బుక్ జర్నలిజం ప్రాజెక్ట్ ద్వారా స్థానిక వార్తల కోసం 25 మిలియన్ డాలర్లు అందిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వార్తా సంస్థలకు అదనపు మార్కెటింగ్ సౌకర్యం కలిగించేందుకు మిగతా 75 మిలియన్ డాలర్లు అందించనున్నారు.
కరోనాను నివారించేందుకు ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్లు కొనసాగుతున్న నేపథ్యంలో చాలా వార్తా సంస్థలు మూతపడుతున్నాయి. మరికొన్ని బాగా నష్టపోతున్నాయి. ప్రకటనలు తగ్గడం వల్ల వాటి ఆదాయాలు పడిపోతుండడమే ఇందుకు కారణం. అందుకే కరోనా ధాటికి తీవ్రంగా నష్టపోయిన దేశాల్లోని... చాలా ఆర్థికావసరాలు ఉన్న ప్రచురణకర్తలకు గ్రాంట్లు అందిస్తామని ఫేస్బుక్ తెలిపింది.
వార్తా సంస్థలకు సాయం
ఆన్లైన్ ప్రకటనలపై, డిజిటల్ కార్యకలాపాలపై ఫేస్బుక్, గూగుల్ ఆధిపత్యం వహిస్తున్నాయి. దీనితో మీడియా ఆదాయానికి తీవ్రంగా గండిపడుతోందని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే ఈ దిగ్గజ సంస్థలు... వార్తా సంస్థలకు సహాయపడే ప్రయత్నాలను ముమ్మరం చేశాయి.
తప్పుడు వార్తల నివారణకు
ఫేస్బుక్... ఏఎఫ్‌పీ, రాయిటర్స్, అసోసియేటెడ్ ప్రెస్‌తో సహా ఇతర మీడియా సంస్థలతో కలిసి వాస్తవ వార్తలు తనిఖీ చేసే కార్యక్రమాలకు మద్దతు తెలిపింది. దీని ద్వారా తప్పుడు వార్తలను న్యూస్‌ఫీడ్‌ల నుంచి తగ్గించడానికి వీలవుతుంది. ఫలితంగా ప్రజలకు సరైన సమాచారం చేరే అవకాశం మెరుగవుతుంది.
ఇదీ చూడండి: 'పీఎం కేర్స్'కు భారీ విరాళాలు- రిలయన్స్ రూ.500 కోట్లు