కరోనా వైరస్ వ్యాప్తిని అదుపు చేయడానికి ప్రభుత్వం సకాలంలో స్పందించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుందని ఇదేనని ఫిక్కీ జాతీయ ఛైర్‌పర్సన్, అపోలో హాస్పిటల్స్ సంయుక్త మేనేజింగ్ డైరెక్టర్ సంగీతారెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ మహమ్మారి అదుపులోకి వచ్చాక ఆర్థిక పరమైన సవాళ్లు చుట్టుముడతాయని, వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధం కావాల్సి ఉందన్నారు. ఇతర దేశాలతో పోల్చితే వైద్య రంగానికి మనం కేటాయిస్తున్న నిధులు ఎంతో తక్కువని, ఇకపై జీడీపీలో కనీసం 2.5 శాతం ఈ రంగానికి కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు.
కొవిడ్-19 ప్రపంచాన్ని భయపెడుతోంది. అమెరికా, బ్రిటన్, ఇటలీ వంటి దేశాలతో పోల్చితే మన పరిస్థితి కొంత మెరుగు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వంగా వేగంగా స్పందించిందా?
ఇటువంటి ఉపద్రవాన్ని మనం ఎన్నడూ చూడలేదు. కొవిడ్-19 బాధితుల సంఖ్య 100 రోజుల వ్యవధిలోనే 1.5 లక్షల మందికి చేరింది. ఎంతో మంది ఉపాధి కోల్పోయారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో చిక్కుకుపోయింది. ‘కరోనా’ కట్టడికి మనదేశం ముందుగానే స్పందించింది. ప్రధానమంత్రి రంగంలోకి దిగి దిద్దుబాటు చర్యలు తీసుకున్నారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలుపుకుని ఐక్య కార్యాచరణ చేపట్టారు. మనదేశం ఈ వ్యాధిని ఎదుర్కొంటున్న తీరును ప్రపంచ దేశాలు హర్షిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం భారతదేశం సకాలంలో, సమగ్రంగా, సమర్థంగా స్పందించినట్లు పేర్కొంది.
లాక్‌డౌన్ తొలగించాక ఆరోగ్యం కంటే ఆర్థికం పెద్ద సమస్య కాబోతోందా?
కొవిడ్-19 వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడటం మాత్రమే కాకుండా ప్రపంచ సరఫరా వ్యవస్థ కుప్పకూలి, డిమాండ్ పతనమైంది. లాజిస్టిక్స్, ఆటోమొబైల్, పర్యాటక రంగం, లోహాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, రిటైల్ వ్యాపారం... ఇలా దాదాపు అన్ని రంగాలపై ఈ ప్రభావం కనిపిస్తోంది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు బాగా దెబ్బతింటున్నాయి. వృద్ధి రేటు తగ్గటమే కాకుండా ఉద్యోగాల కల్పన కష్టతరం అవుతుంది. ఈ సమస్యలను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలి. ప్రస్తుతం పేదలకు అండగా నిలవాలి కాబట్టి, ఆ దిశగా ప్రభుత్వం దృష్టి సారించింది. గత నెల 26న కేంద్ర ఆర్థిక మంత్రి రూ.1.7 లక్షల కోట్ల ఉద్దీపనా పధకాన్ని ప్రకటించారు. ఈ నెల 16న ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, ఆర్థిక వ్యవస్థలో నగదు లభ్యతను పెంపొందించే చర్యలు ప్రతిపాదించారు. మున్ముందు మరికొన్ని చర్యలతో ఆర్థిక వ్యవస్థను సరిదిద్దాలి.
ఈ మహమ్మారి విస్తరించడానికి ముందు కూడా మన దేశ ఆర్థిక వ్యవస్థ స్థితి క్లిష్టంగానే ఉంది. వృద్ధి రేటు 5 శాతం కంటే కిందకు పడిపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంకా నష్టం జరుగుతుంది. దీన్నెలా ఎదుర్కోవాలి?
మన ఆర్థిక వ్యవస్థ నెమ్మదించడం నిజమే. ఇప్పుడు నిరుద్యోగం అతి పెద్ద సమస్య. మెరుగైన ఆర్థికాభివృద్ధి సాధించడమూ సవాలే. మనదేశం ఈ ఆర్థిక సంవత్సరంలో 1.5- 2.8 శాతం వృద్ధి రేటుతో సరిపెట్టుకోవాల్సి వస్తుందని ప్రపంచ బ్యాంకు, 1.5 శాతమే వృద్ధి లభిస్తుందని ఐఎంఎఫ్ పేర్కొన్నాయి. ఆర్థికంగా బలహీన వర్గాల సంక్షేమాన్ని, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను గాడిన పెట్టే చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం నగదు బదిలీ, వేతన సబ్సిడీలు, పన్ను రాయితీలు వంటి ఉపశమన నిర్ణయాలు కొనసాగించాలి. వ్యాపార సంస్థల సీఈఓలు కొత్త తరహా వ్యాపార విధానాల వైపు మొగ్గుచూపాలి. సవాళ్లను తట్టుకొని నిలవగలిగేలా సంస్థలను తీర్చిదిద్దాలి. ‘ప్రపంచీకరణ’ సిద్ధాంతం నుంచి పెద్ద దేశాలు వెనక్కి తగ్గుతున్న సంకేతాలున్నాయి. దీనికి సిద్ధపడుతూ సత్వర ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగాలి.
ఫిక్కీ జాతీయ ఛైర్మన్‌గా ప్రభుత్వానికి మీ సూచనలు ఏమిటి?
ఫిక్కీ- ఎర్నెస్ట్ అండ్ యంగ్ తరఫున ఒక నివేదిక ప్రభుత్వానికి అందించాం. నగదు లభ్యత పెంచే చర్యలు చేపట్టాలని, తక్కువ వడ్డీరేట్లకు రుణాలు ఇవ్వాలని సూచించాం. నేను వ్యక్తిగతంగా...వైద్యసేవల రంగాన్ని ఆదుకోవలసిందిగా ప్రభుత్వాన్ని కోరాను. అవుట్-పేషెంట్లు తగ్గిపోవడం, రోగ నిర్థారణ పరీక్షల సేవలకు డిమాండ్ లేకపోవటం, శస్త్రచికిత్సలు వాయిదా పడటం, ఇతర దేశాల నుంచి రోగులు చికిత్సలకు రాకపోవటం వల్ల వైద్య సంస్థలు ఆర్థికంగా కుంగిపోతున్న విషయాన్ని ప్రస్తావించాను.
ప్రస్తుత పరిస్థితుల్లో 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్ధిక వ్యవస్థను సాధించడం కష్టతరం అవుతుందా?
కొవిడ్-19 ఉపద్రవం నుంచి గట్టెక్కాక ఆర్థిక అంశాలపై దృష్టి సారించాలి. వాస్తవానికి మనం ఒక బలమైన ఆర్థిక వ్యవస్థ నిర్మించడానికి ఇదొక అవకాశం కూడా. గట్టి కసరత్తు చేస్తే వచ్చే అయిదేళ్లలో లక్ష్యాన్ని సాధించవచ్చు.
ఆరోగ్య సేవల రంగం దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ రంగంలో ఎటువంటి సంస్కరణలు తీసుకురావాలి?
ఆరోగ్య సేవలకు అధికంగా నిధులు కేటాయించాలి. అమెరికా జీడీపీలో 18 శాతం సొమ్ము ప్రజారోగ్యానికి ఖర్చు చేస్తున్నారు. మనదేశం ఆరోగ్య సేవల రంగంపై వెచ్చించే మొత్తం జీడీపీలో 1.3 శాతమే. ఈ మొత్తాన్ని కనీసం 2.5 శాతానికి అయినా పెంచాలి. వైద్యుడు- రోగి నిష్పత్తి మెరుగుపడాలి. ప్రస్తుతం వైద్యులపై ఎంతో ఒత్తిడి పడుతోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి స్పెషాలిటీ వైద్య సంస్థలనూ బలోపేతం చేయాలి. ఇందువల్ల ఉద్యోగాల కల్పన, సత్వర ఆర్థికాభివృద్ధి సాధ్యపడతాయి.
ఇవీ చూడండి: నయా మోసం.. లింక్ యాక్సెప్ట్ చేస్తే మొబైల్ రీఛార్జ్