రుణాలు, ఈఎంఐల చెల్లింపుపై మరో మూడు నెలల వరకు మారటోరియాన్ని పొడిగిస్తూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాన్ని ఆర్థిక రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి చర్యల వల్ల రుణగ్రహీతలు అప్పులు చెల్లించకుండా నిర్లక్ష్యం వహించే అవకాశముందని, రానురాను ఇదే అలవాటుగా మారే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.
"రుణాల చెల్లింపుపై మరోసారి మారటోరియాన్ని పొడిగిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. అయితే ఇది రుణగ్రహీతలు అప్పులు చెల్లించకుండా నిర్లక్ష్యం వహించేలా చేస్తుంది. దీనికి బదులు బ్యాంకులు, బ్యాంకింగేతర సంస్థలు తమ ఆస్తులను తిరిగి వర్గీకరించుకోవడానికి (రీ-క్లాసిఫై) అనుమతించడం మంచిది."
- వినీత్ రాయ్, ఆవిష్కార్ గ్రూప్ ఛైర్మన్
సంక్షోభం దృష్ట్యా
దేశంలో కరోనా సంక్షోభం, లాక్డౌన్ దృష్ట్యా... రుణాల చెల్లింపుపై ఆర్బీఐ మార్చిలో మూడు నెలల మారటోరియం విధించింది. మే 31తో ముగియనున్న ఈ మారటోరియాన్ని మరో 90 రోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ సౌలభ్యం రుణగ్రహీతలకు తాత్కాలికంగా లాభం చేకూర్చినా.. దీర్ఘకాలంలో ఇబ్బందిగా పరిణమించే అవకాశం ఉంది.
లాక్డౌన్ సమయంలో కేవలం 20 శాతం రుణగ్రహీతలు... రుణాల చెల్లింపుపై మారటోరియం సౌకర్యాన్ని పొందారని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఛైర్మన్ రజనీష్ కుమార్ ప్రకటించడం గమనార్హం.
ఓ మార్గం కావాలి..
ఆర్బీఐ మరోమారు మారటోరియాన్ని పొడిగించకుండా ఉండాలని బ్యాంకింగ్ రంగం ఆశిస్తోందని వినీత్ రాయ్ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులను తమకు అనుకూలంగా వినియోగించుకోవడానికి రుణదాతలు ఒక మార్గాన్ని అన్వేషించవలసి ఉంటుందని కూడా ఆయన అన్నారు.
భయాలు తొలగిస్తుంది...
'కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పేరుతో ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ, ఆర్థిక సంస్థలకు కొన్ని ఉద్దీపనలు ప్రకటించడం మంచిదే. అయితే ఇవి ఎంత వరకు బ్యాంకింగ్, బ్యాంకింగేతర సంస్థలకు ఉపయోగపడతాయనేది తెలియదు. అలాగే డిఫాల్ట్‌ను నివారించడానికి ప్రజలు స్వల్పకాలిక రుణం తీసుకుంటారనే భావన కూడా సరిగ్గా లేదు.
నిజానికి రుణగ్రహీతలు మూడు నెలలపాటు అప్పులు చెల్లించకుండా వెసులుబాటు కలిగినప్పటికీ... ఇంత తక్కువ కాలంలో వారు తమ రుణాలు చెల్లించే సామర్థ్యాన్ని పెంపొందించుకోవడమూ కష్టమే.
ఏదేమైనా ప్రభుత్వం, ఆర్బీఐలు తీసుకుంటున్న చర్యల ఉద్దేశం మంచిదేనని నేను భావిస్తున్నాను. అయితే టీఎల్టీఆర్ఓ విషయంలో అనుకున్నట్లుగా జరగలేదు. కానీ చివరకు అంతా మంచే జరుగుతుందని ఆశిస్తున్నాను' అని వినీత్ రాయ్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి: 'వర్క్ ఫ్రమ్ హోమ్' ఉద్యోగాల కోసం భారతీయుల వేట