కరోనా సంక్షోభ కాలంలోనూ భారత్‌కు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) భారీగా వచ్చాయని విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా తెలిపారు. గత కొన్ని నెలల్లో 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు సమకూరాయని వెల్లడించారు. యూకేలో జరుగుతున్న సీఐఐ సమావేశంలో ఆయన ఆన్‌లైన్ మాధ్యమంలో ప్రసంగించారు. ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి భారత ప్రభుత్వం తీసుకున్న నిర్మాణాత్మక సంస్కరణల్ని ఈ సందర్భంగా వివరించారు. రక్షణ, అంతరిక్ష, అణుశక్తి వంటి రంగాల్లోనూ ఎఫ్‌డీఐలను భారీ స్థాయిలో ఆహ్వానిస్తున్నామని తెలిపారు. గత ఆరు సంవత్సరాల్లో సులభతర వాణిజ్యం కోసం ప్రధాని మోదీ నేతృత్వంలో అనేక సంస్కరణలు చేపట్టినట్లు వివరించారు. ప్రపంచంలో అందిరికీ అందుబాటులో ఉండే ఆర్థిక వ్యవస్థగా భారత్ రూపుదిద్దుకుందన్నారు. పన్నుల విధింపుల్లో సైతం పారదర్శకత పాటిస్తున్నామన్నారు.
వస్తు, సేవల పన్ను(జీఎస్టీ), ఆధార్, మౌలిక వసతుల అభివృద్ధి, విమానాశ్రయాల అభివృద్ధి, వ్యవసాయం రంగంలో సంస్కరణల వంటి అంశాలను ష్రింగ్లా సమావేశంలో వివరించారు. ఇవన్నీ సత్ఫలితాలిస్తున్నాయనడానికి కరోనా సమయంలోనూ ఎఫ్‌డీఐలు వెల్లువెత్తడమేనని తెలిపారు. 2019లో అంతర్జాతీయంగా ఎఫ్‌డీఐలు ఒక శాతం పడిపోగా.. భారత్‌లో మాత్రం 20 శాతం పెరిగిందని పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి సాంకేతిక సంస్థలైన గూగుల్ 10 బిలియన్ డాలర్లు, ఫేస్‌బుక్ ఐదు బిలియన్ డాలర్లు, బుబాదల 1.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయన్నారు.
ఇక భారత్-బ్రిటన్ మధ్య కూడా వాణిజ్య బంధం కొత్త పుంతలు తొక్కుతోందన్నారు. 2019లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 24 బిలియన్ పౌండ్లు చేరిందన్నారు. కరోనా సమయంలో వ్యాక్సిన్ కోసం ఇరు దేశాలు కలిసి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే భారత్‌లోని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆక్స్‌ఫర్డ్, ఆస్ట్రాజెనెకాతో కలిసి పనిచేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.