నూతన సంవత్సరంలో మీరు కొత్తగా పెట్టుబడులు పెట్టడం, ఉన్న పోర్ట్‌ఫోలియోలను సవరించడం వంటి ఆలోచనల్లో ఉన్నారా? మీరు చెమటోడ్చి సంపాదించిన డబ్బుకు.. ఉత్తమ ప్రతిఫలాలు వచ్చే మదుపు మార్గం ఏదని అనుకుంటున్నారా? అయితే పెట్టుబడి విషయంలో ఒకటి మాత్రం కచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఎందులోనైనా పెట్టుబడి పెట్టేముందు రిటర్నులతోపాటు రిస్క్ ఉంటుందనే విషయాన్ని మర్చిపోవద్దు.
ఈ ఏడాది కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకున్నా, పోర్ట్‌ఫోలియోను సవరించాలనుకున్నా.. 2019లో ఈక్విటీ, బంగారం, రియల్టీ రంగాల్లో మదుపులు ఎలాంటి ప్రతిఫలాలు ఇచ్చాయో చూద్దాం.
ఈక్విటీ మార్కెట్లు..
2019లో ఈక్విటీ మార్కెట్లు పేలవమైన ప్రదర్శన చేసినట్లు పెట్టుబడిదారులు అభిప్రాయపడుతున్నారు. నిఫ్టీ 50 గతేడాది (2019) 13 శాతం రిటర్నులు మాత్రమే ఇచ్చింది. ఈ ప్రతిఫలం మదుపరులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.
ముఖ్యంగా ఆర్థిక వృద్ధి మందగమనం, విదేశీ పెట్టుబడిదారులపై సర్‌ఛార్జీ పెంచాలని బడ్జెట్లో ప్రతిపాదించడం వంటివి ప్రతికూల ప్రభావం చూపాయి. కార్పొరేట్ల ఆదాయాలు తగ్గడం, అంతర్జాతీయ మార్కెట్లలో అస్థిరత కారణంగా కొన్ని నెలలుగా మార్కెట్లు పెద్దగా రాణించలేకపోయాయి.
బంగారం ఎంతవరకు మేలు..?
సగటు భారతీయులు కచ్చితంగా బంగారంపై ఎంతోకొంత పెట్టుబడి పెడుతుంటారు. దేశంలో చాలా కుటుంబాలు ఒక తరం నుంచి మరో తరానికి ఆస్తిగా బంగారం ఇస్తుంటాయి. ఈక్విటీ మార్కెట్లతో పోలిస్తే.. 2019లో బంగారం మంచి ప్రతిఫలాలను ఇచ్చిందనే చెప్పాలి. గతేడాది పసిడిపై పెట్టుబడి పెట్టిన వారు 23 శాతం మేర రిటర్నులు దక్కించుకోగలిగారు.
అయినప్పటికీ బంగారంపై పెట్టుబడులు అనేవి.. ఆర్థిక అనిశ్చితి ఉన్నప్పుడు మాత్రమే ఉత్తమ పెట్టుబడులుగా పనిచేస్తాయి. పసిడిపై లాభాలను సరిగ్గా అంచనా వేయలేం. ప్రపంచ మార్కెట్లకు తగ్గట్లు ధరల్లో వ్యత్యాసం ఉంటుంది.
బ్యాంక్ ఫిక్సెడ్ డిపాజిట్
బ్యాంకుల్లో ఫిక్సెడ్ డిపాజిట్ల రూపంలో మదుపు చేయడం అనేది ఒక సంప్రదాయ పద్ధతి. నిర్ణీత సమయం వరకు తమ సొమ్ము పెట్టుబడిగా పెట్టి.. వడ్డీ రూపంలో ఆదాయాన్ని గడిస్తుంటారు. అయితే 2019లో ఫిక్సెడ్ డిపాజిటర్లను ఆకట్టుకోవడంలో బ్యాకింగ్ రంగం విఫలమైంది. వరుసగా డిపాజిట్ రేట్లు తగ్గుతూ రావడమే ఇందుకు కారణం.
నిఫ్టీ ప్రభుత్వ రంగ బ్యాంకులు గతేడాది పేలవమైన ప్రదర్శన కనబరిచాయి. నిఫ్టీ బ్యాంకు దాదాపు 19 శాతం నష్టపోయింది. కుంభకోణాలు, మొండిబకాయిలు, ఎన్‌బీఎఫ్‌సీల సంక్షోభం వంటివి ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. మొత్తం మీద 2019లో బ్యాంకులు ఫిక్సెడ్ డిపాజిట్లపై 7.5-8 శాతం వడ్డీ ఇచ్చాయి. ఇది మదుపరులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే సంప్రదాయ పద్ధతిలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఫిక్సెడ్ డిపాజిట్ అనేది మంచి పెట్టుబడి సాధనంగా చెప్పొచ్చు.
రియల్ ఎస్టేట్
గత ఏడాది (2019) రియల్ ఎస్టేట్ ఆశించిన స్థాయిలో లాభాలు పొందలేదు. ఆవాస స్థిరాస్తుల రంగమూ అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రాపర్టీ బ్రోకరేజీ సంస్థ ఆనరాక్ ప్రకారం ఇళ్ల అమ్మకాలు 2019లో 4-5 శాతం పెరిగి.. 2.58 లక్షలుగా ఉన్నాయి. మొత్తం ఇళ్ల అమ్మకాల్లో 8 శాతం వృద్ధి నమోదైంది.
వాణిజ్య స్థలం విభాగంలో 2019లో కాస్త వృద్ధి సాధించినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ మార్కెట్ అస్థిరతల కారణంగా.. మున్ముందు ఇంకా ప్రతికూలంగా ఉండనున్నట్లు అంచనా. ఈ పరిణామాలు, మార్కెట్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మీ పెట్టుబడులను 30-40 శాతం ఈక్విటీల్లో (ప్రత్యక్షంగా, పరోక్షంగా), మిగతా పెట్టుబడులను స్థిరమైన ఆదాయమిచ్చే సెక్యూరిటీల్లో, బంగారం, స్థిరాస్తి రంగాల్లో పెట్టుబడి పెడితే మంచి ఫలితాలు రాబట్టొచ్చు.
పెట్టుబడిపై తక్కువ రిస్క్ తీసుకోవాలనుకుంటే.. మీ పోర్ట్‌ఫోలియోలో 30-40 శాతం స్థిరాదాయ (బ్యాంకు డిపాజిట్లు, ప్రభుత్వ బాండ్లు) మదుపు సాధానాల్లో ఉంచండి. మరో 30-40 శాతాన్ని ఈక్విటీల్లో, మిగతా మొత్తాన్ని బంగారం, రియల్టీ రంగాల్లో పెట్టుబడి పెట్టడం మేలు.
(రచయిత-ఇందూ చౌదరి, పర్సనల్ ఫినాన్స్ నిపుణురాలు)
గమనిక: పైన తెలిపిన పెట్టుబడి సలహాలు, సూచనలు నిపుణుల నుంచి సేకరించినవి మాత్రమే. ఈటీవీ భారత్‌కు గానీ, సంస్థ యాజమాన్యానికి వీటితో సంబంధం లేదు. ఈ సూచనలతో పెట్టుబడి పెట్టాలనుకునే వారు మరోసారి నిపుణులను ప్రత్యక్షంగా కలిసి అభిప్రాయం తీసుకున్న తర్వాతే తదుపరి నిర్ణయానికి వెళ్లాలని ఈటీవీ భారత్ సలహా.
ఇదీ చూడండి : ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ ఖాయం: హర్దీప్