చైనా నుంచి దిగుమతి చేసుకునే ముడి సరుకుపై అధికంగా ఆధారపడే గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థలు కరోనా నేపథ్యంలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చైనాలో కొవిడ్ ప్రభావం అధికంగా ఉన్న నేపథ్యంలో ఆ దేశం నుంచి దిగుమతులు నిలిచిపోయాయి. ఫలితంగా ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడింది.
అయితే ఏప్రిల్లోగా ముడి సరుకు రవాణా మెరుగవ్వకపోతే ఆయా సంస్థలు 'రెడ్ జోన్'లోకి వెళ్లే పరిస్థితి వస్తుంది అని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఎయిర్కండీషనర్స్, టెలివిజన్స్, రిఫ్రిజిరేటర్స్ వంటి ఎలక్ట్రానిక్ ధరలను సవరించాల్సి వస్తుందని కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ అప్లైన్సెస్ మాన్యూఫాక్చరర్స్ అసోసియేషన్ (సెమా) తెలిపింది. ప్రస్తుతం చైనాలో పరిశ్రమలు తెరుచుకున్నా.. వాటి సగం సామర్థ్యంతోనే పని చేస్తున్నట్లు వెల్లడించింది.
ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈ నెల రెండో అర్ధభాగం నుంచి ఏసీలపై 2 శాతం నుంచి 3 శాతం వరకు ధరలు పెంచనున్నట్లు గోద్రేజ్ సంస్థ ప్రకటించింది.