కరోనా రోగుల కోసం కొత్త చికిత్సా విధానాలను అభివృద్ధి చేస్తున్నామని హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఔషధ ఉత్పిత్తి సంస్థ డాక్టర్ రెడ్డీస్ ప్రకటించింది. రానున్న నెలల్లో వీటిని అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపింది. అదే సమయంలో.. ప్రస్తుతం వినియోగిస్తున్న ఔషధాల ఉత్పత్తిని నిరంతరాయంగా కొనసాగిస్తామని స్పష్టం చేసింది.
"అత్యంత వేగంగా, ఆచరణ సాధ్యమైన పద్ధతుల్లో కొవిడ్ రోగులకు చికిత్స అందించేందుకు మేం కట్టుబడి ఉన్నాం. వివిధ సంస్థలతో మేం జట్టుకట్టిన సందర్భాల్లో ఇది నిరూపితమైంది. రెమ్‌డెసివిర్ సహా ఇతర ఔషధాల సరఫరాను కొన్ని వారాలుగా మేం భారీగా పెంచాం. దాంతోపాటుగా మేం నూతన చికిత్సా విధానాలను తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. మరికొన్ని నెలల్లో వాటిని మేం మార్కెట్లో విడుదల చేస్తాం. అదే సమయంలో.. ప్రస్తుతం వినియోగిస్తున్న ఔషధాలను డిమాండ్‌కు తగ్గట్టుగా ఉత్పత్తి చేస్తాం."
- జీవీ ప్రసాద్, డాక్టర్ రెడ్డీస్ కో ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్
రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వి టీకాను భారత్‌లో డాక్టర్ రెడ్డీస్ పంపిణీ చేస్తోంది. డీఆర్డీఓతోనూ ఔషధాల ఉత్పత్తిలో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
125 మిలియన్ల రోగుల కోసం 250 మిలియన్ల స్పుత్నిక్-వి టీకా డోసులను తాము పంపిణీ చేస్తామని డాక్టర్ రెడ్డీస్ సీఈఓ ఎరెజ్ ఇజ్రాయెలీ తెలిపారు. ఈ టీకా డోసుల్లో ముందు కొంత భాగం... రష్యా నుంచి దిగుమతి అవుతుందని చెప్పారు. మరోవైపు.. దేశీయంగానూ వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసేందుకు 6 కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం తాము ఈ వ్యాక్సిన్ సరఫరాపై దృష్టి సారించామన్నారు. రానున్న రోజుల్లో సింగిల్ డోసు టీకా స్పుత్నిక్-లైట్‌ను భారత్‌లో అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తామని తెలిపారు.
డాక్టర్ రెడ్డీస్‌తో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా తొలి విడతలో.. రష్యా నుంచి మే 1న భారత్‌కు స్పుత్నిక్-వి టీకా డోసులు దిగుమతి అయ్యాయి. ఈ టీకా అత్యవసర వినియోగానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) ఇటీవల ఆమోదం తెలిపింది.
ఇదీ చూడండి: తెలంగాణకు 'మేఘా' ఆక్సిజన్ క్రయోజనిక్ ట్యాంకులు
ఇదీ చూడండి: అమెరికాకు నాట్కో ఫార్మా కేన్సర్ ఔషధం