ప్రయాణికుల కార్ల విక్రయాల్లో సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది జులైలో ఈ విభాగ అమ్మకాల్లో క్షీణత 3.86 శాతానికే పరిమితం కావడం ఇందుకు నిదర్శనమని భారత వాహన తయారీదార్ల సంఘం(సియామ్) పేర్కొంది. 2019 జులైలో 1,90,115 కార్లు విక్రయమవగా.. ఈ ఏడాది జులైలో అవి 1,82,779గా నమోదయ్యాయి. జూన్‌తో పోలిస్తే ఇవి చాలా మెరుగయ్యాయి. ఈ ఏడాది జూన్‌లో 1,05,617 ప్రయాణికుల వాహనాల అమ్మకాలు నమోదయ్యాయి. 2019 జూన్‌తో పోలిస్తే ఇవి 49.59 శాతం తక్కువ.
ఇక ద్విచక్ర వాహనాల విషయానికొస్తే.. గతేడాది జులై అమ్మకాలు 15,11,717 తో పోలిస్తే అవి 15.24 శాతం తగ్గి 12,81,354కు పరిమితమయ్యాయి. మోటార్‌సైకిళ్ల అమ్మకాలు 9,34,021 నుంచి 4.87 శాతం తగ్గి 8,88,520కి చేరగా.. స్కూటర్ల విక్రయాలు 36.51 శాతం తగ్గి 3,34,288కి చేరాయి. ఏడాది కిందట జులైలో ఇవి 5,26,504 అమ్ముడుపోయాయి.
సానుకూలతలు:
'కరోనా అనంతరం కొన్ని నెలల పాటు విక్రయాలు భారీగా తగ్గాయి. ఒక దశలో సున్నా విక్రయాలు నమోదయ్యాయి. ఇపుడు ప్రయాణికుల వాహనాలు, ద్విచక్ర వాహన అమ్మకాల్లో సానుకూలతలు కనిపిస్తున్నాయి. అంతక్రితం నెలలతో పోలిస్తే జులైలో చాలా తక్కువ క్షీణత నమోదైంది.'
-సియామ్ ప్రెసిడెంట్ రాజన్ వధేరా
ఈ గిరాకీ కొనసాగుతుందా లేదా కేవలం తాత్కాలిక గిరాకీనా అనేది ఆగస్టు విక్రయాలను బట్టి తెలుస్తుందన్నారు రాజన్.
సియామ్ లెక్కల ప్రకారం..
మారుతీ సుజుకీ ఇండియా జులై 2019లో 71,486 కార్లను విక్రయించగా..ఈ జులైలో 70,090 కార్లను అమ్మగలిగింది. హ్యుందాయ్ మోటార్ ఇండియా సైతం గతేడాది జులైలో 22,776 కార్లు అమ్మగా.. ఈ సారి 19,828కు చేర్చగలిగింది. హీరో మోటార్ సైకిల్ సైతం అంతక్రితం ఏడాదితో పోలిస్తే పెద్దగా మార్పు లేకుండా 5,06,946 ద్విచక్రవాహనాలను అమ్మింది. హోండా మాత్రం 32% తక్కువగా 3,09,332 వాహనాలను విక్రయించింది.