మీ స్మార్ట్‌ఫోన్‌కు రక్షణనిచ్చే కండోమ్ గురించి తెలుసా? మీరు విన్నది నిజమే.. స్మార్ట్‌ఫోన్‌కు రక్షణనిచ్చే కండోమ్ మార్కెట్లో దొరుకుతుంది. ఇంతకి స్మార్ట్ ఫోన్‌కు రక్షణగా కండోమ్ ఏంటనుకుంటున్నారా? అయితే ఈ కథనం పూర్తిగా చదవాల్సిందే.
సాంకేతికత రోజురోజుకు పెరుగుతోంది. టెక్నాలజీతో పాటే మోసాలు చేసే వారూ పెరుగుతున్నారు. ముఖ్యంగా అజ్ఞాత ప్రదేశాల్లో స్మార్ట్ ఫోన్ ఛార్జీంగ్ పెట్టడం వల్ల ఈ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వీటిని అరికట్టేందుకు తీసుకొచ్చిందే 'యూఎస్బీ కండోమ్'. దీన్నే 'డేటా బ్లాకర్' అని.. అధికారికంగా 'పోర్టాపావ్' మూడోతరం యూఎస్బీ డేటా బ్లాకర్ అని కూడా పిలుస్తారు.
ఎలా పనిచేస్తుంది..
ప్రస్తుతం స్మార్ట్ఫోన్లకు ఛార్జింగ్ అనేది పెద్ద తల నొప్పిగా మారింది. ఇంట్లో ఉన్నప్పుడు ఇది పెద్ద సమస్యకాకపోయినప్పటికీ.. ప్రయాణాల సమయంలో చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇందుకోసం పవర్ బ్యాంక్‌లు ఉన్నా.. ఒకటి రెండు సార్లకన్నా ఎక్కువగా ఫోన్‌ను ఛార్జింగ్ చేయలేం. అలా ప్రయాణ సమయాల్లో ఉన్నప్పుడు రైల్వే స్టేషన్లలో, బస్టాండ్లలో ఎక్కడపడితే అక్కడ ఛార్జింగ్ పెట్టుకుంటారు చాలా మంది. అయితే అక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడం ఎంత సురక్షితమని చాలా మంది అలోచించరు. అలాంటి ఛార్జింగ్ స్పాట్లను లక్ష్యంగా చేసుకుని స్కామర్లు చాలా మంది స్మార్ట్‌ఫోన్ యూజర్ల డేటాను చోరీ చేస్తున్నారు. అదేలా అంటే స్మార్ట్ ఫోన్‌ను ఆయా ఛార్జింగ్ పాయింట్ల దగ్గర ఛార్జ్ చేసేందుకు కేబుల్ ద్వారా కనెక్ట్ చేసినప్పుడు నేరుగా ఆ ఫోన్ల డేటా స్కామర్ల చేతికి వెళ్తోంది. దీని ద్వారా ఆనేక మోసాలు జరుగుతున్నాయి.
అయితే.. కొత్త ప్రదేశాల్లో నేరుగా ఏదైన ఛార్జింగ్ పోర్ట్‌కు అనుసంధానం చేయాల్సి వచ్చినప్పుడు మీ డేటా.. చోరీకి గురవ్వకుండా ఉండేందుకు ఈ డేటా బ్లాకర్ అనే పరికరం ఉపయోగపడుతుంది.
ఎలా వాడాలి.. ధరెంత?
ఫోన్ ఛార్జింగ్ పెట్టెడప్పుడు..ఛార్జర్‌కు అనుసంధానం చేసే చివర ఈ డేటా బ్లాకర్ పరికరాన్ని ప్లగ్ ఇన్ చేయాలి. దానికి యూఎస్బీ కేబుల్‌ను అనుసంధానం చేసి ఫోన్ ఛార్జింగ్ చేసుకోవాలి. ఇది మీ ఫోన్లో ఉన్న డేటా కేబుల్ ద్వారా ట్రాన్స్ఫర్ కాకుండా చూస్తుంది. దీంతో మీ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ ఎక్కడ పెట్టినా.. డేటా సురక్షితంగా ఉంటుంది.
ప్రస్తుతం మార్కెట్లో యూఎస్బీ కండోమ్ ధర దాదాపు రూ.500గా ఉంది. అయితే యూఎస్బీ-సీ డివైజ్‌లకు ఈ డేటా బ్లాకర్ పని చేయదు. త్వరలోనే టైప్-సీ పోర్ట్‌కు సరిపోయే యూఎస్బీ కండోమ్ మార్కెట్లోకి రానుంది.
ఇదీ చూడండి:నవంబర్‌లో మళ్లీ తగ్గిన వాహన విక్రయాలు