బైక్ కొంటున్నప్పుడు ధర, మైలేజీ, డిజైన్లతోపాటు తప్పనిసరిగా పరిశీలించాల్సింది సేఫ్టీ ఫీచర్. మన ప్రయాణం సురక్షితం కావాలంటే ఇది తప్పనిసరి. ప్రస్తుతం ద్విచక్రవాహనాల్లో ఉండే అన్నిరకాల సేఫ్టీ ఫీచర్లు, వాటి పనితీరు తెలుసుకుందాం. కొత్తగా బైక్ కొంటున్నప్పుడు వీటిలో ఏదైనా ఒక్క ఫీచర్ అయినా ఉండేలా చూసుకుందాం.
ట్రాక్షన్ కంట్రోల్
తడి, నునుపైన, బురద రోడ్లపై మోటార్‌సైకిళ్ల టైర్లకు అంతగా పట్టుండదు. కొంచెం యాక్సలరేటర్ తిప్పగానే పట్టు తప్పి జారిపోతుంటాయి. ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్ ఉంటే నేల, టైరుకు మధ్య అనుసంధానం పెరుగుతుంది. టైరుకు గురుత్వాకర్షణశక్తి ఎక్కువయ్యేలా చేస్తుంది. గుంతలు, నీరు నిలిచిన చోట బండి వేగంగా వెళ్తున్నప్పుడు రెండు టైర్ల మధ్య సమన్వయం చేస్తూ పట్టు జారిపోకుండా చేస్తుంది. ఖరీదైన బైకుల్లోనే ఈ ఫీచర్ ఉంటుంది.
కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ (సీబీఎస్)
ఏబీఎస్‌తో పోల్చినప్పుడు అంత శక్తిమంతమైంది కాకపోయినా కమ్యూటర్ వాహనాల్లో సీబీఎస్ ఒక నమ్మకమైన భద్రతా ఫీచర్. ఈ వ్యవస్థ ఉన్న వాహనంలో వెనక బ్రేక్ వేసినప్పుడు ఆ శక్తి ఆటోమేటిగ్గా ముందు బ్రేక్‌కు వెళ్లిపోయి అది కూడా పని చేస్తుంది. అంటే ఏ బ్రేక్ వేసినా ఒకే సమయంలో రెండూ పని చేస్తాయి. నియంత్రణ బాగుండి బ్రేకుల సామర్థ్యం పెరిగిపోతుంది.
రియర్ లిఫ్ట్ ఆఫ్ ప్రొటెక్షన్ (ఆర్‌ఎల్‌పీ)
డిస్క్ బ్రేక్‌లు ఉండే మోటార్‌సైకిళ్లలో ఈ భద్రతా ఫీచర్ ఉంటుంది. 150-200సీసీతో సింగిల్ ఏబీఎస్ ఉన్న బైకుల్లో ఈ సేఫ్టీ ఫీచర్ వాడతారు. అకస్మాత్తుగా బ్రేక్ వేసినప్పుడు బండి అదుపు తప్పకుండా, పడిపోకుండా వెనక టైరు గాల్లోకి లేస్తూ భారమంతా ముందు టైరుపై పడేలా చేస్తుంది.
మోటార్‌సైకిల్ స్టెబిలిటీ కంట్రోల్ (ఎంఎస్‌సీ)
ద్విచక్రవాహనాల్లో ఈ ఫీచర్‌ను అత్యుత్తమ భద్రతా కవచంగా, ఆల్ ఇన్ వన్‌గా చెబుతారు. ట్రాక్షన్ కంట్రోల్ ఇందులో భాగంగానే ఉంటుంది. బండి ప్రయాణంలో ఉన్నప్పుడు పక్కలకు వంగిన కోణం, రైడర్ బండి నడిపే విధానం, యాక్సలరేషన్, బ్రేక్‌లు వేసే తీరు, మూలమలుపుల్లో బండి వంచే విధానం, వేగం.. వీటన్నింటినీ ఎలక్ట్రానిక్ భాగాలు గణించి, అంచనా వేసి దానికి అనుగుణంగా బ్రేకింగ్ అందేలా, మంచి స్టెబిలిటీ ఉండేలా ఈ ఫీచర్ చేస్తుంది. దీంతో కుదుపులూ గణనీయంగా తగ్గుతాయి.
కొలిజన్ వార్నింగ్ సిస్టమ్
ట్రాఫిక్‌లో, వేగంలో ఉన్నప్పుడు అప్రమత్తంగా లేకపోతే రెప్పపాటులో ప్రమాదాలు జరుగుతాయి. ఇలా జరగకుండా కాపాడేదే కొలిజన్ వార్నింగ్ సిస్టమ్. ఈ ఏర్పాటు ఉన్న బండి ఏదైనా వాహనానికి ప్రమాదకరంగా సమీపంలోకి వచ్చినప్పుడు, రైడర్ దీన్ని గమనించనప్పుడు వ్యవస్థ యాక్టివేట్ అవుతుంది. ఒకరకమైన శబ్దం విడుదల చేస్తుంది. సంకేతాలు పంపిస్తుంది. రైడర్ అప్రమత్తం కావొచ్చు.
వీలీ కంట్రోల్
1000సీసీ దాటిన సూపర్ బైక్‌లలోనే ఉండే మేటి ఫీచర్. ముఖ్యంగా డుకాటీ ద్విచక్రవాహనాల్లో ఈ భద్రతా ఏర్పాటు కనిపిస్తుంది. అత్యధిక సీసీ ఉండే బండికి ఒక్కసారిగా యాక్సలరేషన్ ఇస్తే ముందు టైరు అమాంతం గాల్లోకి లేస్తుంది. అప్పుడు రోడ్డుపై పట్టు కోల్పోకుండా, బండి సురక్షితంగా ముందుకెళ్లడానికి ఈ ఫీచర్ రక్షణగా ఉంటుంది.
యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్)
125 సీసీ దాటిన ప్రతి మోటార్‌సైకిల్‌లో ఈ భద్రతా ఫీచర్ తప్పనిసరి. సాధారణంగా విపరీతమైన వేగంతో వెళ్తున్నప్పుడు ఒక్కసారిగా బ్రేక్ వేస్తే వాహనం పక్కకి ఒరిగి పడిపోతుంటాం. యాంటీ లాక్ బ్రేకింగ్ వ్యవస్థ ఉంటే అది వేగంగా తిరిగే చక్రానికి ఒక్కసారి కాకుండా రెప్పపాటులోనే విడతలవారీగా బ్రేకులు వేస్తూ, వదులుతూ ఉంటుంది. దీంతో నియంత్రణ సాధ్యమై పడిపోకుండా ఉండగలం. ఏబీఎస్ ఒక చక్రం లేదా రెండు చక్రాలకూ ఉంటుంది.
ఇదీ చూడండి: రివ్యూ 2019: విమానాల జోరుకు మందగమనం బ్రేకులు