తమ వెబ్సైట్ హ్యాకింగ్‌కు గురైందన్న వార్తలపై డీపీఐఐటీ(డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్) స్పందించింది. సాధారణ అప్డేట్ వల్లే వెబ్సైట్ సేవల్లో అంతరాయం ఏర్పడిందని.. ఎవరూ హ్యాక్ చేయలేదని స్పష్టం చేసింది.
చైనా నుంచి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను డీపీఐఐటీ నియంత్రిస్తుంది. వెబ్సైట్లో సోమవారం మధ్యాహ్నం కొన్ని చైనా/జపాన్ అక్షరాలు కనిపించాయి. భారత్-చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్త వాతావరణం, ఆర్థిక సేవల పేరిట సైబర్ నేరగాళ్లు భారీ మోసాలకు పాల్పడే అవకాశం ఉందని 'ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్'(సీఈఆర్‌టీ-ఇన్) ఇప్పటికే హెచ్చరించిన నేపథ్యంలో.. డీపీఐఐటీ వెబ్సైట్ హ్యాకింగ్‌కు గురైందని భావించారు.
"నిర్వహణలో భాగంగా వెబ్సైట్ సేవలను సోమవారం మధ్యాహ్నం కొంతసేపు నిలిపివేశాం. ఈ సమయంలో కనిపించిన ఓ లోగో.. ఎన్నో ఏళ్ల ముందు ఈ వెబ్‌సైట్‌ను రూపొందించిన జపాన్ కంపెనీది. ఇప్పుడు వెబ్‌సైట్‌ను పునరుద్ధరించాం. ఇటీవలే వెబ్సైట్ భద్రతను ఆడిట్ చేశాం. నిర్వహణ సమయంలో వెబ్సైట్ ఎలాంటి హ్యాకింగ్‌కు గురికాలేదు."
--- డీపీఐఐటీ ప్రకటన.