'కొవాగ్జిన్' టీకాను 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సున్న పిల్లలపై పరీక్షించడానికి అనుమతి కోరిన భారత్ బయోటెక్‌ను.. టీకాకు సంబంధించిన ప్రభావశీలత సమాచారాన్ని అందజేయాలని భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) సారథ్యంలోని సబ్జెక్టు నిపుణుల కమిటీ (ఎస్‌ఈసీ) కోరినట్లు తెలిసింది. భారత్ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్ టీకాను అత్యవసర వినియోగ అనుమతి కింద ప్రస్తుతం ప్రజలకు ఇస్తున్నారు. ఈ అనుమతి షరతు ప్రకారం 18 ఏళ్ల కంటే పైబడిన వారికి మాత్రమే ఇవ్వాలి. పిల్లలపై దీని ప్రభావశీలత పరీక్షించలేదు కాబట్టి, ఇప్పుడు అటువంటి పరీక్షలు నిర్వహించడానికి భారత్ బయోటెక్ సన్నద్ధమవుతోంది. అందుకు అనుమతి కోరగా, మరికొంత సమాచారం కావాలని ఎస్‌ఈసీ సూచించినట్లు తెలిసింది.
స్పుత్నిక్ టీకాకూ..
డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్‌ను కూడా స్పుత్నిక్ వీ టీకా భద్రత, రోగ నిరోధక శక్తి (ఇమ్యూన్ రెస్పాన్స్)కి సంబంధించిన సమాచారాన్ని సమర్పించాల్సిందిగా ఎస్‌ఈసీ సూచించించినట్లు తెలిసింది. రష్యాకు చెందిన ఆర్‌డీఐఎఫ్ తయారు చేసిన ఈ కొవిడ్-19 టీకాను మనదేశంలో విక్రయించడానికి వీలుగా దీనిపై డాక్టర్ రెడ్డీస్ ఇక్కడే క్లినికల్ పరీక్షలు నిర్వహిస్తోంది. స్పుత్నిక్ వీ టీకాకూ అత్యవసర వినియోగ అనుమతి కోరుతూ ఇటీవల డీసీజీఐకి దరఖాస్తు చేసింది. ఈ సమాచారం అందించిన తర్వాత, అది సంతృప్తికరంగా ఉన్నట్లయితే స్పుత్నిక్ వీ టీకాకు అత్యవసర వినియోగ అనుమతి వచ్చే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు.
ఇదీ చూడండి:ఆ టీకా ఒక్క డోసు తీసుకున్నప్పటికీ సేఫ్!