కరోనా వైరస్‌ను నిర్మూలించేందుకు స్వదేశంలో అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా(Covaxin) శాస్త్రీయ ప్రమాణాలు, డేటా పారదర్శకంగా ఉన్నాయని భారత్ బయోటెక్ తెలిపింది. ప్రభావశీలత, భద్రతలో కొవాగ్జిన్‌కు తిరుగులేదని, ఈ విషయాన్ని తొమ్మిది జర్నల్స్ శాస్త్రీయంగా సమీక్ష (పీర్-రివ్యూ) చేశాయని, ఇందులో లాన్సెట్, సెల్‌ప్రెస్ లాంటి అంతర్జాతీయ జర్నల్స్ ఉన్నాయని పేర్కొంది.
"టీకా సమర్థత, భద్రతపై 12 నెలల వ్యవధిలో తొమ్మిది పరిశోధన అధ్యయనాలు వెలువడ్డాయి. మా డేటా పారదర్శకం. భారత్‌లో మనుషులపై క్లినికల్ ట్రయల్స్ చేసిన తొలి, ఏకైక టీకా కొవాగ్జినే. కొత్త వేరియంట్లపై ప్రభావానికి సంబంధించిన డేటా కూడా కొవాగ్జిన్‌పైనే విడుదలైంది. భారత జనాభాపై ప్రభావశీలత డేటా ఉన్న ఏకైక టీకా కూడా కొవాగ్జినే. మా నిబద్ధతను డేటా జనరేషన్, డేటా పారదర్శకత, అంతర్జాతీయ పరిశోధన పత్రాలే చెబుతాయి" అని భారత్ బయోటెక్ పేర్కొంది. కొవాగ్జిన్ శాస్త్రీయ ప్రమాణాలు పారదర్శకమని, ఇందులో రాజీ ప్రసక్తే లేదని సంస్థ సహ వ్యవస్థాపకురాలు, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ (జేఎమ్‌డీ) సుచిత్ర ఎల్ల ట్వీట్ చేశారు.
తొలి నుంచీ పారదర్శకతే
కొవాగ్జిన్ ప్రి క్లినికల్ ట్రయల్స్‌పై 'సెల్‌ప్రెస్' అధ్యయనాలను ప్రచురించింది. క్లినికల్ ట్రయల్స్ తొలి, రెండో దశలపై 'లాన్సెట్- ఇన్‌ఫెక్షియస్ డిసీజెస్' జర్నల్ సమగ్రంగా విశ్లేషించింది. కొవాగ్జిన్ సురక్షితమని, ఎటువంటి దుష్ప్రభావాలు చూపకుండా రోగ నిరోధకతను ఇస్తుందని ప్రకటించింది. కొత్తగా వచ్చిన వేరియంట్లను నిర్వీర్యం చేసే సామర్థ్యం కొవాగ్జిన్‌కు ఉందని ఆన్‌లైన్‌లో జీవశాస్త్రాల పరిశోధన పత్రాలను ప్రచురించే బయోఆర్‌ఎక్స్‌ఐవీ, క్లినికల్ ఇన్‌ఫెక్షియస్ డిసీజెస్, ట్రావెల్ మెడిసన్ జర్నల్స్ పేర్కొన్నాయి.
త్వరలో మూడో దశ ఫలితాలు
త్వరలో కొవాగ్జిన్ మూడో దశ క్లినికల్స్ ట్రయల్స్ డేటా విశ్లేషణ విడుదలవుతుందని భారత్ బయోటెక్ తెలిపింది. ఈ డేటాను.. ముందుగా కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీవో)కు అందిస్తామని, తర్వాత అంతర్జాతీయ శాస్త్రపరిశోధన పత్రికల్లో నిపుణుల సమీక్ష (పీర్-రివ్యూ) కోసం పంపిస్తామని వెల్లడించింది.
ఇదీ చదవండి:అమెరికాలో కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్!