గతేడాదితో పోలిస్తే.. రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుందని ప్రముఖ రియల్టీ కన్సల్టెంట్ సంస్థ నైట్‌ఫ్రాంక్ అర్ధ వార్షిక సర్వే ద్వారా తెలిసింది. దేశవ్యాప్తంగా 8 ప్రధాన నగరాల్లో గతేడాది తొలి ఆరు నెలలతో పోలిస్తే.. 2021 జనవరి-జూన్ మధ్య నివాస స్థిరాస్తి రంగం 53 శాతం వృద్ధి సాధించిందని నైట్ ఫ్రాంక్ తెలిపింది.
గతేడాదిలాగే ఈసారి కూడా లాక్డౌన్లు, సెకండ్ వేవ్ భయాలు ఉన్నా.. వాక్సిన్ అందుబాటులోకి రావటం, ఆర్థిక వ్యవస్థ తేరుకుంటుండటం, ఆంక్షల సడలింపు వంటి కారణాలతో ఈ వృద్ధి నమోదైనట్లు సర్వే పేర్కొంది.
దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో స్థిరాస్తి రంగం శరవేగంగా విస్తరిస్తోందని తెలిపింది సర్వే.
చాలా రాష్ట్రాలు స్టాంప్ డ్యూటీ తగ్గించుకోవటం వల్ల ఇళ్ల కొనుగోళ్లకు ప్రోత్సాహం లభించినట్లయిందని సర్వే వెల్లడించింది. గడిచిన ఏడాది కాలంలో రెసిడెన్షియల్ ధరలు పెద్దగా పెరగలేదని.. చాలా నగరాల్లో ధరలు స్థిరంగా ఉన్నట్లు వివరించింది.
చెన్నై, హైదరాబాద్‌లో మాత్రం 5 శాతం ధరలు పెరిగినట్లు నైట్ ఫ్రాంక్ తెలిపింది.
ఇదీ చదవండి:హోం లోన్ అప్లికేషన్ రిజక్ట్ అయ్యిందా?