1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో భారత్ విజయం సాధించి 50 ఏళ్లు గడిచిన సందర్భంగా ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ జావా రెండు కొత్త రంగుల్లో మోటార్‌సైకిళ్లను విడుదల చేసింది. యుద్ధంలో తిరుగులేని పోరాటం కొనసాగించిన సైనిక దళాలకు గుర్తింపుగా ఖాకీ, మిడ్‌నైట్ గ్రే కలర్లలో స్పెషల్ ఎడిషన్ బైక్‌ను తీసుకొచ్చింది. వీటి ఇంధన ట్యాంకుపై మువ్వన్నెల జెండాతో పాటు భారత సైన్యానికి చెందిన చిహ్నాన్ని ముద్రించారు. '1971 యుద్ధంలో విజయం సాధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా - 1971-2021' అని చిహ్నం కింద రాయడం విశేషం.
'గర్వంగా ఉంది'
జావా ప్రత్యేక ఎడిషన్లపై మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా స్పందించారు. యుద్ధంలో విజయం సాధించిన హీరోలకు గౌరవంగా కొత్త ఎడిషన్ బైక్‌లను తీసుకురావడం కోసం జావా బృందం చేసిన ప్రయత్నం చూస్తే గర్వంగా ఉందని వ్యాఖ్యానించారు. బైక్‌లపై భారత సైన్యం చిహ్నం ఉంచే అవకాశం రావడం ఎంతో గౌరవం అన్నారు.
ధర ఎంతంటే..?
ఇక ఈ స్పెషల్ ఎడిషన్ బైక్ ధరను రూ.1.93 లక్షలుగా నిర్ణయించారు. జావా42 ధరతో పోలిస్తే రూ.15,000, స్టాండర్డ్ వెర్షన్‌తో పోలిస్తే రూ.6,000 అధికం. వినియోగదారులు ఆన్‌లైన్ ద్వారా ఈ బైక్‌ను బుక్ చేసుకోవచ్చు. 293 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ కలిగిన ఈ బైక్ 26.9 బీహెచ్‌పీ శక్తి వద్ద 27.02 ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది.
ఇదీ చూడండి: బడ్జెట్ బైక్‌లు కావాలా?- రూ.లక్ష లోపు బెస్ట్ ఇవే!
ఇదీ చూడండి: BMW electric Bike: ఒకసారి ఛార్జింగ్‌తో 130 కిమీ ప్రయాణం