కరోనా నేపథ్యంలో పర్యటకుల భయాన్ని పొగొట్టేందుకు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. క్రిస్మస్, కొత్త సంవత్సరం వేడుకలకు గోవాలో ప్రత్యేక బబుల్ హాలీడే ప్యాకేజీలను అందించేందుకు ఎయిరేషియా ఇండియా, తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్‌ను నిర్వహించే ఇండియన్ హోటల్‌లతో మేక్‌మైట్రిప్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ముందస్తు కొవిడ్ పరీక్షలు, శానిటైజ్ చేసిన క్యాబ్‌లు, మధ్య వరుసను ఖాళీగా ఉంచి చార్టర్ విమానాలు, తాజ్ హోటళ్లలో విలాసవంత వసతి సదుపాయాలను ఈ ప్యాకేజీలో అందిస్తున్నారు. గోవాలో కొన్ని ప్రదేశాలను కూడా మేక్‌మైట్రిప్ ప్రత్యేకంగా లీజుకు తీసుకుని పర్యటక సేవలు అందించనుంది. దీని వల్ల బబుల్ హాలీడే పర్యటకులకు బయటవారితో సంబంధాలు తగ్గుతాయని, ఇది వారి భద్రతను పెంచుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.
దుబాయి, మాల్దీవులకు గిరాకీ
ఇక ఎప్పటిలాగే ఈ చలికాలంలో కూడా గోవా, లోనావాలా, మహబలేశ్వర్, పుదుచ్చేరి, కూర్గ్, సిమ్లా, మనాలి, డార్జిలింగ్‌ల్లో విహారానికి పర్యటకులు ఆసక్తి చూపుతున్నారు. తక్కువ సమయంలో విదేశాలను చుట్టొచ్చేందుకు వీలుగా ఉండే దుబాయ్, మాల్దీవులకు సైతం గిరాకీ గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం దేశీయ పర్యటక ప్రాంతాలకు విమాన బుకింగ్‌లు 25 శాతం పెరిగాయని, స్వల్పకాలంలో ఇదే ధోరణి కొనసాగవచ్చని మేక్‌మైట్రిప్ పేర్కొంటోంది. చివరి నిమిషం వరకు, ముందస్తు బుకింగ్ ఆఫర్లను అందిస్తున్నట్లు బుకింగ్ డాట్ కామ్ తెలిపింది.
కొవిడ్ కారణంగా రాష్ట్రాల పర్యటక నిబంధనలకు అనుగుణంగా పర్యటకులకు వారి ప్రణాళికలను మార్చుకునే సౌలభ్యాన్ని ఈ సంస్థ అందిస్తోంది. గతేడాది క్రిస్మస్, కొత్త సంవత్సరం హోటల్ బుకింగ్‌లతో పోలిస్తే ప్రస్తుతం మూడింట ఒకవంతు మాత్రమే అయ్యాయని, అయితే గత కొన్ని నెలల్లో వచ్చిన రికవరీతో భవిష్యత్‌పై ఆశావహంగా ఉన్నట్లు బుకింగ్ డాట్ కామ్ వివరించింది. మారియట్, అకార్, తాజ్, లీలా హోటల్స్, వెల్‌కంహెరిటేజ్, హయత్ హోటళ్లతో ఈ సంస్థ జట్టు కుదుర్చుకుంది. ఇందులో భాగంగా పర్యటకులకు 10 శాతం వరకు రాయితీ, కాంప్లిమెంటరీ యాడ్ ఆన్స్ అందిస్తోంది.
ఇదీ చూడండి : చిన్న మొత్తమైనా 'సిప్'తో ప్రయోజనాలెన్నో..