తూర్పు లద్దాక్‌లో భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ అనంతరం డ్రాగన్ హ్యాకర్ల దాడి పెరిగింది. చైనాకు చెందిన పలు హ్యాకింగ్ బృందాలు... భారతదేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలే లక్ష్యంగా సైబర్ దాడులు చేస్తున్నట్లు సింగపూర్‌కు చెందిన సైబర్ ఇంటెలిజెన్స్ సంస్థ 'సైఫిర్మా రీసెర్చ్' తెలిపింది.
రక్షణ మంత్రిత్వ శాఖ, జియో, ఎయిర్‌టెల్, బీఎస్ఎన్ఎల్, మైక్రోమాక్స్, సిప్లా, సన్ ఫార్మా, ఎంఆర్ఎఫ్, ఎల్ అండ్ టీ సంస్థలను చైనా హ్యాకింగ్ బృందాలు లక్ష్యంగా చేసుకున్నట్లు సైఫిర్మా రీసెర్చ్ పేర్కొంది. వాణిజ్య రహస్యాలతో సహా సున్నితమైన సమాచారాన్ని హ్యాక్ చేయడం ద్వారా ఆయా సంస్థల ప్రతిష్ఠను దెబ్బతీయటమే చైనా హ్యాకర్ల లక్ష్యంగా కనిపిస్తోందని వెల్లడించింది. ఇతర దేశాల్లో సైబర్ దాడులకు పాల్పడిన అనుభవం ఈ హ్యాకర్లకు ఉన్నట్లు పేర్కొంది.
హ్యాకర్ల కార్యకలాపాలు, ఐపీ అడ్రస్‌లను విశ్లేషణ చేసిన తరువాత చైనా ప్రభుత్వంతో సంబంధమున్న గోతిక్ పాండా, స్టోన్ పాండా అనే హ్యాకర్లు ఈ సైబర్ దాడులకు పాల్పడుతున్నట్లు సింగపుర్ ఇంటెలిజెన్స్ ఓ నివేదిక విడుదల చేసింది.
ఇదీ చూడండి: 'పుణె'వాలా రికార్డు- తక్కువ కాలంలో భారీగా పెరిగిన సంపద