అమెరికా - చైనా వాణిజ్య ఒప్పందంలో మరో ముందడుగు పడింది. ఇరుదేశలూ ఒకరి ఉత్పత్తులపై మరొకరు విధించిన సుంకాలను దశల వారీగా తొలగించాలని తాజాగా ఓ అంగీకారానికి వచ్చాయి. ఫలితంగా అమెరికా - చైనా మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధానికి తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి.
"గత రెండు వారాలుగా ఇరుదేశాల సంధానకర్తలు వాణిజ్య ఒప్పందంపై నిర్మాణాత్మక చర్చలు జరుపుతున్నారు. ఇరుదేశాల ఉత్పత్తులపై అదనంగా పెంచిన సుంకాలను దశలవారీగా తొలగించేందుకు అంగీకరించారు. దీనితో తుది ఒప్పందం దిశగా అడుగులు వేశారు."
- గావో ఫెంగ్, చైనా వాణిజ్య మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి
ఫేజ్-1
ఫేజ్-1 ఒప్పందంలో భాగంగా ఇరుదేశాలు సమాన నిష్పత్తిలో ఒకేసారి గతంలో విధించిన సుంకాలను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించినట్లు గావో తెలిపారు. ఒప్పందం చేరుకోవడానికి ఇదే ప్రధానమైన షరతు అని ఆయన స్పష్టం చేశారు. అయితే... ఇందుకోసం ఎంత గడువు నిర్దేశించుకున్నదీ ఆయన వెల్లడించలేదు.
"సుంకాల పెంపుతో ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం మొదలైంది. వాటిని రద్దు చేస్తే వాణిజ్య యుద్ధం పూర్తవుతుంది."
- గావో ఫెంగ్, చైనా వాణిజ్య మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి
వాణిజ్య యుద్ధం..
ఏడాదిన్నర నుంచి అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతోంది. ఫలితంగా వందల బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులపై రెండు దేశాలు ఒకదానిపై ఒకటి భారీ స్థాయిలో సుంకాలు విధించుకున్నాయి. తాజా ఒప్పందంతో ఈ వాణిజ్య యుద్ధానికి తెరదించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరుదేశాధినేతలు త్వరలోనే ఇందుకు సంబంధించిన ఒప్పందంపై సంతకం చేసే అవకాశం ఉంది.
ఇదీ చూడండి: కర్తార్పుర్పై పాక్ ప్రధానిదో మాట- సైన్యానిది మరో మాట